logo

ఎలుకలు కొరుకుతున్నాయ్‌!

ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో భద్రత గాలికి వదిలేశారు.. రెండేళ్ల నుంచి నాడు-నేడు పేరుతో ఊరిస్తూ కనీస వసతులు విస్మరించారు.. కూలిన ప్రహరీలు, చెత్తాచెదారం, ఆరుబయట మురుగు, అపరిశుభ్రత.. పరిసరాల్లో పిచ్చిమొక్కలు, ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి.

Updated : 01 Dec 2022 10:57 IST

అపరిశుభ్రంగా వసతిగృహాలు

భయం.. భయంగా విద్యార్థులు

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో భద్రత గాలికి వదిలేశారు.. రెండేళ్ల నుంచి నాడు-నేడు పేరుతో ఊరిస్తూ కనీస వసతులు విస్మరించారు.. కూలిన ప్రహరీలు, చెత్తాచెదారం, ఆరుబయట మురుగు, అపరిశుభ్రత.. పరిసరాల్లో పిచ్చిమొక్కలు, ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. వసతి గృహాల్లో ఎలుకలు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. దోమలు దాడి చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. సోమవారం రాత్రి గుత్తి మండలం సేవాఘడ్‌లోని గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికి 11 మందిని గాయపరిచాయి.


అనంతపురంలోని సాంఘిక సంక్షేమ-2, 4 వసతి గృహాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రెండింటిలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. గృహ ఆవరణలోని పాత భవనంలో వృథా వస్తువులు నిల్వ చేశారు. వెనుక వైపున చెత్త పేరుకుపోయింది. ఇక్కడ డంపింగ్‌ యార్డును తలపిస్తోంది.


దండుగా వచ్చి దాడి

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: సేవాఘడ్‌లోని గిరిజన సంక్షేమ పాఠశాల వసతి గృహంలో 537 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు రోజుల కిందట ఎలుకలు పలువురు విద్యార్థులను కొరికి గాయపరిచిన విషయం తెలిసిందే. వారంరోజులుగా రాత్రిళ్లు ఎలుకల దండు ప్రవేశించి విద్యార్థులను గాయాలపాలు చేస్తున్నా ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడలేదు. ఏకంగా గోడలకు రంధ్రాలు వేసి ప్రవేశిస్తున్నాయి. కిటికీల గుండా గదుల్లోకి దండుగా చేరి విద్యార్థులపై దాడి చేస్తున్నాయి. వసతి గృహం చుట్టూ ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. మరుగుదొడ్లు నీరు బయటకు ప్రవహిస్తూ దుర్వాసన వస్తోంది. దీంతో ఎలుకలు, విషపురుగులు వస్తున్నాయని చిన్నారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఎలుకల దాడిలో 11 మంది విద్యార్థులు గాయపడగా.. వారంతా నేరుగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఉపాధ్యాయులెవరూ వెంట రాలేదని బాధితులు చెబుతున్నారు. రాత్రిళ్లు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.


నిర్వహణకు నిధులేవి?

ఒక్కో వసతి గృహాన్ని శుభ్రంగా ఉంచేందుకు పరకలు, ఫినాయిల్‌, బ్లీచింగ్‌ పౌడరు తదితర వాటికి సుమారు రూ.25 వేలు ఖర్చవుతుంది. ఫ్యాన్లు, ట్యూబులు, తాగునీటి మోటారు మరమ్మతులకు అదనపు ఖర్చు వస్తుంది. కనీసం శుభ్రతా చర్యలకు నిధులు విడుదల చేయడం లేదు. చెత్తాచెదారం పరిసరాల్లోనే వేస్తున్నారు. వాటిల్లో విష పురుగులు చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి. ముళ్లపొదల తొలగింపు, మెష్‌ ఏర్పాటు, ఇతర మరమ్మతులకు రూ.8.23 కోట్లు అవసరమని రెండేళ్ల కిందటే ప్రతిపాదించారు. ఇప్పటిదాకా పైసా విడుదల చేయలేదు.


అప్రమత్తం చేస్తున్నాం

వసతి గృహాలను శుభ్రంగా ఉంచాలి. చిన్నపాటి మరమ్మతులకు ఒక్కో వసతి గృహానికి రూ.2 వేలు నుంచి రూ.4 వేల వరకు ఇచ్చాం. మెష్‌ ఏర్పాటు, మరమ్మతులకు నిధులు విడుదల కాలేదు. నాడు నేడులో మరమ్మతులు చేస్తామని చెప్పారు. గుత్తిలో మెష్‌ కొట్టించినా ఊడిపోవడంతో ఎలుకలు చేరాయి.

- విశ్వమోహన్‌రెడ్డి, ఖుష్భూకొఠారి, అన్నాదొర, సాంఘిక, వెనుకబడిన, గిరిజన సంక్షేమశాఖల సాధికారత అధికారులు


అనంతపురంలోని గిల్డ్‌ ఆఫ్‌ స్కూలు పక్కన మూడు వసతి గృహాలు ఉన్నాయి. పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు 600 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. ప్రధాన ద్వారం పక్కనే ప్రహరీ కూలింది. అడ్డుగా తుప్పు పట్టిన ఇనుప రేకు ఉంచారు. ఇక్కడ్నుంచి విష పురుగులు ప్రవేశిస్తున్నాయి.


ఎటు చూసినా సమస్యలే..

శింగనమల నియోజకవర్గంలో 12 వసతి గృహాలు, 11 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 4,200 మంది విద్యార్థులు ఉన్నారు. శింగనమల మండలం తరిమెల ఎస్సీ బాలుర వసతి గృహ భవనం శిథిలమైంది. ఇందులో విషపురుగులు సంచరిస్తున్నాయి. నార్పల ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాల వద్ద కోతుల బెడద అధికంగా ఉంది. గార్లదిన్నె మైనార్జీ గురుకుల పాఠశాలలో సరైన వసతుల్లేవు. పుట్లూరు బీసీ వసతి గృహానికి ప్రహరీ లేదు. బుక్కరాయసముద్రం ఎస్సీ బాలుర వసతి గృహంలో 130 మంది ఉన్నారు. ఇక్కడ పిచ్చిమొక్కలు అధికంగా ఉన్నాయి. విష పురుగులు సంచరిస్తున్నాయి.

- శింగనమల, నార్పల గ్రామీణం, బుక్కరాయసముద్రం

బుక్కరాయసముద్రం ఎస్టీ బాలుర వసతి గృహంలో పిచ్చిమొక్కలు


కాలకృత్యాలు ఆరు బయటే

రాయదుర్గంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 66 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి గతంలో నిర్మించిన మరుగుదొడ్లకు నీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయి. కాలకృత్యాలకు బయటికి వెళ్లాల్సిందే. రాత్రివేళ చీకట్లో బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

- రాయదుర్గం పట్టణం


రక్షణ ఏదీ?

కళ్యాణదుర్గంలోని ఎస్సీ కళాశాల వసతి గృహంలో 90 మంది ఉండగా.. ప్రహరీ ఓవైపు కూలిపోయింది. పెద్ద గేటు సమీపంలో పిచ్చిమొక్కలు ఉన్నాయి. తరచూ ఆవరణలోకి పాములు, విషకీటకాలు వస్తున్నాయి. శెట్టూరు ఎస్సీ బాలుర వసతి గృహంలోనూ అదే పరిస్థితి.

- కళ్యాణదుర్గం గ్రామీణం


మొత్తం వసతి గృహాలు: 215

విద్యార్థుల సంఖ్య: 23,041
మరమ్మతులకు ప్రతిపాదనలు : రూ.8.23 కోట్లు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు