logo

సారూ.. డబ్బులు వెనక్కి ఇప్పించండి

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు. గతంలో అడంగళ్‌లో ఉండేవి. వివిధ కారణాలతో తొలగించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌ అడంగళ్‌లో నమోదు చేయాలని సంబంధిత రైతులు తహసీల్దారును కోరితే.. డబ్బులిస్తే గాని పని కాదని చెప్పారు.

Published : 01 Dec 2022 06:09 IST

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు. గతంలో అడంగళ్‌లో ఉండేవి. వివిధ కారణాలతో తొలగించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌ అడంగళ్‌లో నమోదు చేయాలని సంబంధిత రైతులు తహసీల్దారును కోరితే.. డబ్బులిస్తే గాని పని కాదని చెప్పారు. ఆన్‌లైన్‌లో నమోదైతే బ్యాంకు ద్వారా రుణాలే కాకుండా భూమిపై హక్కులు వస్తాయని ఆశపడి.. 13 మంది రైతులు రూ.10.80 లక్షలు వసూలు చేసి అధికారికి ఇచ్చారు. తహసీల్దారు చేసిన అక్రమాలు వెలుగు చూడటంతో సస్పెండ్‌కు గురయ్యారు. కూడేరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో గత తహసీల్దారు శ్రీనివాసులు ఆన్‌లైన్‌ అడంగళ్‌లో నమోదు చేయడానికి రూ.లక్షలు వసూలు చేశారు. డబ్బు తీసుకున్నా.. పని కాలేదు. ప్రస్తుతం అతను సస్పెండ్‌ కావడంతో పెద్దమొత్తంలో డబ్బు చెల్లించిన వారు తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు సీపీఎం నాయకుడు రాంభూపాల్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు ఆర్డీఓ మధుసూదన్‌కు వినపత్రం సమర్పించారు.


రూ.40 వేలు ఇచ్చా

మరుట్ల రెవెన్యూ గ్రామంలో 5 ఎకరాల పొలం సాగు చేసుకుంటున్నా. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని దరఖాస్తు చేశా. లంచంగా రూ.40వేలు ఇవ్వాలని అప్పటి తహసీల్దారు శ్రీనివాసులు డిమాండు చేశారు. ఆయన అడిగిన మొత్తం ఇచ్చేశా. పని మాత్రం కాలేదు. నా డబ్బు వెనక్కి ఇప్పించాలి.

- ముత్యాలు, కరుట్లపల్లి


ఉద్యమం చేస్తాం

ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమికి ఆన్‌లైన్‌, పాసుపుస్తకాలకు రూ.30 వేలు గత తహసీల్దారుకు ఇచ్చాం. ఆయన సస్పెండ్‌ కావడంతో మా డబ్బులు వెనక్కి అడుగుతున్నాం. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పైసా వెనక్కి ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకుంటే ఉద్యమం చేయాలని నిర్ణయించాం.

- ఎర్రిస్వామి, జయపురం


కరుణించలేదు

ప్రభుత్వ అసైన్‌మెంటు భూమిలో ఏళ్ల నుంచి పండ్ల తోటలు పెట్టాను. సాగులో ఉన్న భూమికి హక్కులు కల్పించాలని ఎప్పటి నుంచో ప్రాథేయ పడుతున్నా. గత తహసీల్దారుకి రూ.80 వేలు ఇచ్చా. అయినా పాసుపుస్తకాలు జారీ చేయలేదు. డబ్బు వెనక్కి ఇవ్వాలని చాలా రోజుల నుంచి ఆయన్ను కోరుతున్నా కరుణించలేదు.

- లోకేశ్వరరెడ్డి, జల్లిపల్లి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని