logo

ఎండుకు తిరస్కరించారు?

శాసన మండలి (ఎమ్మెల్సీ) రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటు నమోదుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 02 Dec 2022 06:08 IST

ఎమ్మెల్సీ ఓటు నమోదుపై సందేహాలు
స్పష్టత ఇవ్వని బీఎల్‌ఓలు

కలెక్టర్‌ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేస్తున్న తెదేపా నాయకులు

* అనంత నగరం అశోక్‌నగర్‌లో ఆదినారాయణ స్వగృహంలో నలుగురు పట్టభద్రులు ఉన్నారు. ముగ్గురి దరఖాస్తులు ఆమోదం పొందాయి. మరొకరిది తిరస్కరించారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఓటరు జాబితాలో పేరు లేదు. ఇలా అనంత నగరంలోనే 8,351 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

* కూడేరు మండలంలో 494, రొళ్లలో 182.. ఇలా ప్రతి మండలంలోనూ భారీగానే తిరస్కరించారు. బీఎల్‌ఓల పరిశీలన సరిగా చేయలేదన్నదే విమర్శ ఉంది. నగరంలోని పోలింగ్‌ స్టేషన్‌ 127 పరిధిలో క్రమసంఖ్య 60, 61లో ఒకే వ్యక్తి వివరాలు ఉన్నాయి. ఇలాంటి తప్పిదాలు దొర్లాయి.

న్యూస్‌టుడే: జిల్లా సచివాలయం: శాసన మండలి (ఎమ్మెల్సీ) రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటు నమోదుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హతలున్నా దరఖాస్తులను పక్కన పెట్టేశారు. ఎందుకు తిరస్కరించారో క్షేత్ర స్థాయిలో బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ), తహసీల్దార్లు చెప్పడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు నమోదు అయ్యాయి. కలెక్టరేట్‌లోనూ దరఖాస్తుల పరిశీలన హడావుడిగా చేసినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి అనంత, కడప, కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా 79,066 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో పట్టభద్రుల దరఖాస్తులు 69,943, ఉపాధ్యాయుల దరఖాస్తులు 9,123 ఉన్నాయి. దీనిపై ఎమ్మెల్సీ అభ్యర్థులు, బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. గురువారం తెదేపా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి, ఆపార్టీ నాయకులు శ్రీధర్‌చౌదరి, ఆలం నరసానాయుడు, ఆదినారాయణ, ఎంఎస్‌ రాజు, డేగల కృష్ణమూర్తి తదితరులు కలెక్టర్‌ను కలిసి ఆధారాలతోసహా వివరించారు.

దరఖాస్తులు 3,92,526

ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో 3,92,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టభద్రులు 3,61,084 మందిలో 69,943, ఉపాధ్యాయులు 31,442 మందిలో 9,123 దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా అనంత జిల్లాలో 20,055, కడపలో 19 వేలు, కర్నూలులో 17 వేలకుపైగా, నంద్యాలలో 11 వేలుపైనే దరఖాస్తుల ఆమోదం లభించలేదు.

క్షేత్రస్థాయికి వెళ్లకుండానే..

దరఖాస్తుల నమోదు నవంబరు 7తో ముగిసింది. అదే నెల 19 వరకు పరిశీలన, స్క్రూట్నీ సాగింది. కలెక్టరేట్‌లో ఏడు బృందాలు, ప్రతి మండలంలోనూ బీఎల్‌ఓలు క్షేత్ర పరిశీలన చేశారు.  ఓపెన్‌ డిగ్రీతోపాటు ఇంటర్‌ విద్యార్హత పత్రాన్ని చూపించిన దరఖాస్తులను పక్కన పెట్టారు. అనంత, రొళ్ల, ముదిగుబ్బ, కూడేరులో ఎక్కువగా పక్కకు పెట్టినట్లు సమాచారం. బీఎల్‌ఓలు నేరుగా ఇంటికి వెళ్లి పరిశీలించకుండా.. దరఖాస్తుదారులకు ఫోన్‌ చేసి వాస్తవ పత్రాలను చూశారు. దాదాపు 70వేల దరఖాస్తుల తిరస్కరణకు కారణం ఏమిటో స్పష్టత ఇవ్వలేదు.

పునఃపరిశీలన చేయాలి

ఓటు నమోదు దరఖాస్తుల పరిశీలన సక్రమంగా చేపట్టలేదు.  అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గి కొన్నిచోట్ల అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని ఆధారాలతోసహా కలెక్టర్‌ నాగలక్ష్మికి విన్నవించాం. అన్నింటిని పునఃపరిశీలన చేయాలి.

రామగోపాల్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని