logo

అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు?

ప్రభుత్వమే మనదైనప్పుడు.. ప్రభుత్వ భూములు మాత్రం మనవి కావా? అని అనుకున్నారేమో.. ముదిగుబ్బ మండలంలో వైకాపా నాయకులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు.

Updated : 03 Dec 2022 05:17 IST

13 ఎకరాల గుట్టను మింగేసిన వైకాపా నాయకులు

గుంజేపల్లి పరిధిలోని 1190-2, 4 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. స్థానిక వైకాపా నాయకులు సుమారు అర ఎకరా స్థలాన్ని కబ్జా చేశారు. ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, ముదిగుబ్బ: ప్రభుత్వమే మనదైనప్పుడు.. ప్రభుత్వ భూములు మాత్రం మనవి కావా? అని అనుకున్నారేమో.. ముదిగుబ్బ మండలంలో వైకాపా నాయకులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. నియోజకవర్గంలో కీలక నాయకుడి అండ, అధికారుల సహకారంతో మండల కేంద్రం చుట్టూ సెంటు భూమి ఖాళీ లేకుండా ఆక్రమించేస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారి ప్రభుత్వ భూముల్లో పాతిన హెచ్చరిక బోర్డులను సైతం తొలగించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇళ్ల స్థలాలకు డిమాండు పెరగడంతో గుట్టలను చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. రోడ్లను సైతం ఆక్రమించుకుని భవనాలు కడుతున్నారు. సెంటు రూ.2 లక్షలు చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోర్టులో ఉన్న భూముల్ని సైతం వదల్లేదు. రెవెన్యూ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీస చర్యలు తీసుకోవడం లేదు.

అధికారుల అండతోనే..

ముదిగుబ్బకు ఆనుకుని జాతీయ రహదారి బైపాస్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో భూముల ధర అమాంతం పెరిగింది. అసైన్డ్‌భూముల్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి విక్రయించేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. చుట్టుపక్కల అసైన్డ్‌భూములు ఖాళీ లేకపోవడంతో ప్రభుత్వ భూములపై వైకాపా నాయకుల కన్ను పడింది. ముదిగుబ్బకు ఆనుకుని గుట్టలన్నింటినీ చదును చేసేస్తున్నారు. మండల కేంద్రానికి ఆనుకుని ఇప్పటికే 20 ఎకరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.

మండల నాయకుడి దందా

ముదిగుబ్బ ఆనుకుని గుంజేపల్లి, దొరిగల్లు పొలం పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణ వెనుక మండలానికి చెందిన వైకాపా కీలక నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇతరులకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తొలుత ప్రభుత్వ భూముల్లో కొంతమంది ద్వారా పునాదులు తవ్విస్తున్నారు. పాత తేదీలతో నకిలీ ఇంటి పట్టాలు సృష్టించి.. గతంలోనే ప్రభుత్వం తమకు భూమి కేటాయించిందని బుకాయిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు లేకపోవడం వీరికి కలిసొస్తోంది. సదరు నాయకుడి భూదందాపై సొంత పార్టీ నాయకులే ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల మండల సర్వసభ్య సమావేశంలో భూ ఆక్రమణపై రెవెన్యూ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


మా దృష్టికి రాలేదు

నాగేంద్రకుమార్‌, తహసీల్దార్‌, ముదిగుబ్బ

జాతీయ రహదారికి ఆనుకుని 1224, 1225 సర్వే నంబర్లలో ఉన్న నల్లగుట్ట ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటాం. స్టేడియం స్థలాన్ని ఆక్రమించిన వారికి గతంలోనే నోటీసులు ఇచ్చాం. హెచ్చరిక బోర్డుకూడా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో స్థలం కబ్జాకు గురికాకుండా కంచె ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ స్థలాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని