logo

దివ్యంగా.. దూరం పెట్టారు!

దివ్యాంగులకు సంక్షేమంతో పాటు వారి ఉపాధికి ఊతమిచ్చే అంశాలను పూర్తిగా విస్మరించారు. అరకొర ఉపకరణాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప.. ఆర్థిక భరోసా కల్పించడం లేదు.

Published : 03 Dec 2022 02:35 IST

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై నీలినీడలు

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

న్యూస్‌టుడే, అనంత సంక్షేమం, పుట్టపర్తి  గ్రామీణం

శిక్షణ ఉత్పత్తి కేంద్రంలో మూల పడిన పరికరాలు

దివ్యాంగులకు సంక్షేమంతో పాటు వారి ఉపాధికి ఊతమిచ్చే అంశాలను పూర్తిగా విస్మరించారు. అరకొర ఉపకరణాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప.. ఆర్థిక భరోసా కల్పించడం లేదు. విధి చిన్న చూపు చూసినా.. వారిని ఆత్మస్థైర్యంతో ముందుకు నడిపించడంలో అధికారులు పూర్తిగా చతికిల పడ్డారు. 

ప్రకటించారు విస్మరించారు

మూడు చక్రాల మోటారు వాహనాలకు కోసం అనంతపురం నుంచి 323, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 223 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రతి నియోజకవర్గానికి పది మందికి చొప్పున కేవలం 140 మందికి మాత్రమే ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు 20 సిద్ధం చేశారు. ఎప్పుడు ఇస్తారన్నది స్పష్టత లేదు.

మూడేళ్లుగా రుణాల్లేవ్‌

ఆర్థిక పునరావాసం కింద రుణాలు ఇచ్చే వారు. ఎంత రుణం ఇచ్చినా రూ.లక్ష వరకు రాయితీ ఇస్తూ ప్రోత్సహించే వారు. 2016 నుంచి 2019 వరకు అనంతపురం జిల్లాలో రూ.1.95 కోట్లు బ్యాంకుల ద్వారా రుణం అందజేశారు. ఏకంగా రూ.1.80 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. గత మూడేళ్లుగా ఈ పథకానికి మంగళం పాడారు.

రాయితీ ఎత్తేశారు..

గతంలో రుణాలకు రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చేవారు.  తాజాగా రూ.లక్ష మాత్రమే రుణం ఇస్తామని, ఆ సొమ్ము అంతా కట్టాల్సిందేనని నేషనల్‌ హ్యాండీక్యాప్డ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌డీసీ) ప్రకటించింది. దీంతో పేదలు దరఖాస్తు చేసుకోలేదు. 14 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. వారికి కూడా రుణం ఇచ్చిన దాఖలాలే లేవు.

అందని ఉపకరణాలు

విభిన్న ప్రతిభావంతులకు మొత్తం 10 రకాల ఉపకరణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది కేవలం 558 మందికి మాత్రమే అందజేశారు. ఇందులో 172 మందికి రూ.51.60 లక్షలు విలువ చేసే ల్యాప్‌ట్యాప్‌లు అందించారు. 100 మందికి చరవాణుల కోసం రూ.15 లక్షలు వెచ్చించారు. మిగిలిన 8 రకాల ఉపకరణాలకు రూ.8 లక్షలు మాత్రమే నిధులు మంజూరు కావడంతో ఆమేరకు ఉపకరణాలు అందించారు. పలువురు దివ్యాంగులు వీటి కోసం కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేసినా ప్రయోజనం లేదు.

తయారీకే పరిమితం

విభిన్న ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పలు రకాల ఉత్పత్తులు తయారు చేసే కేంద్రాన్ని 1984లో రెండుఎకరాల్లో పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేశారు. గతంలో 40మంది ఉద్యోగులు, వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారు. ప్రస్తుతం నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. బయటి వ్యక్తుల తో మూడు చక్రాల సైకిళ్లను తయారు చేయిస్తున్నారు. గతంలో ఏడు కోర్సుల్లో శిక్షణ ఇచ్చే వారు. ప్రస్తుతం ఒక్క కోర్సు కూడా నిర్వహించ లేదు. ప్రహరీ కూలిపోవడం, చుట్టూ ముళ్ల పొదళ్లు విస్తరించాయి.


మూడు చక్రాల వాహనం ఇస్తే ఉపాధి పొందుతా

నాగరాజు, నాలుగో రోడ్డు

మా నాన్న లేడు. అమ్మకు పని చేతకాదు. పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. మూడు చక్రాల వాహనానికి దరఖాస్తు చేశా. అది ఇస్తే టీ తయారు చేసుకొని వాహనంలో వెళ్లి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది.


క్రీడాకారులను విస్మరించారు

శ్రీనివాసులు, అసోసియేషన్‌ కార్యదర్శి

పారా అథ్లెటిక్స్‌ ఇతరత్రా క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన వారికి నగదు పథకం అందివ్వాలి. జిల్లా నుంచి 26మంది పాల్గొనగా 9మంది క్రీడాకారులు నగదు ప్రోత్సాహానికి ఎంపికయ్యారు. ఇంత వరకు నగదు ఇవ్వలేదు.


ప్రోత్సాహం అందిస్తున్నాం

అబ్దుల్‌ రసూల్‌, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు

విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాం. రాయితీ ఇచ్చే పథకం అమలు చేస్తే తెలియజేస్తాం. సబ్సిడీ లేకుండా రూ.లక్ష రుణం ఇవ్వబోతున్నాం. మూడు చక్రాల మోటారు వాహనాలు అందజేస్తాం. ఉపకరణాలు ఎప్పటి కప్పుడు అందజేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని