logo

వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అరాచకపాలనలో అన్నివర్గాల ప్రజలు తీరని అన్యాయానికి గురయ్యారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ పూల నాగరాజు విమర్శించారు.

Updated : 03 Dec 2022 05:18 IST

బొమ్మనహాళ్‌: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అరాచకపాలనలో అన్నివర్గాల ప్రజలు తీరని అన్యాయానికి గురయ్యారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ పూల నాగరాజు విమర్శించారు. శుక్రవారం సాయంత్రం నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించారు. అధికారపార్టీ నాయకులు ఇసుక, కంకర, మట్టి, కర్ణాటక మద్యం రవాణాతో అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు తాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, సిమెంటు రోడ్ల నిర్మాణం ఎక్కడా చేపట్టలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు ఉపాధ్యాయులు నియామకం చేపట్టక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులను అభివృద్ధి పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడున్నరేళ్లలో జిల్లాలో లక్షలాది మందికి పింఛన్లు, రేషన్‌ కార్డులు తొలగించారన్నారు.


‘పిచ్చోడి చేతిలో పాలన’

ఆత్మకూరు: ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిచ్చివాడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన ఉందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం తలుపూరు, రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామంలో శుక్రవారం ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె  పాల్గొన్నారు. ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలపై ధరల భారం మోపకుండా, ప్రభుత్వ సంస్థల ఆస్తులను తనఖా పెట్టకుండా తాము అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగైన పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. శ్రీహరిపురంలో వాల్మీకి విగ్రహానికి, దివంగత పరిటాల రవీంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.


నీళ్లున్నా కాలువలకు ఇవ్వలేరా?

బెళుగుప్ప: జలాశయాల్లో నీళ్లున్నా కాలువలకు ఇవ్వలేని పరిస్థితి.. వర్షాలు ఎక్కువగా కురిసినా పంటలకు సకాలంలో నీళ్లు అందిస్తారన్న నమ్మకం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, అవినీతి, అరాచక పాలనే కారణమని ప్రజలు గుర్తించాలన్నారు. మండలంలోని ఎర్రగుడి, ఆవులెన్న గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలు ఆవిష్కరించారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని