logo

అద్దె తగ్గించరు.. ఎవరూ ముందుకు రారు!

భారత రైల్వేలో మొట్టమొదటిసారిగా రైలు బోగీని హోటల్‌గా మార్చిన గుంతకల్లు అధికారులు దాన్ని వినియోగంలోకి తేవడంలో విఫలమయ్యారు.

Published : 03 Dec 2022 02:35 IST

రెండేళ్లుగా దిష్టిబొమ్మలా మిగిలిన రైలు బోగీ క్యాంటీన్‌

ప్రారంభానికి నోచుకోని రైలుబోగీ క్యాంటీన్‌

గుంతకల్లు, న్యూస్‌టుడే: భారత రైల్వేలో మొట్టమొదటిసారిగా రైలు బోగీని హోటల్‌గా మార్చిన గుంతకల్లు అధికారులు దాన్ని వినియోగంలోకి తేవడంలో విఫలమయ్యారు. రెండు సంవత్సరాల కిందట దాన్ని గుంతకల్లు రైల్వే జంక్షన్‌ ముందు ఏర్పాటు చేశారు. దీని అద్దెను నిర్ధారించే బాధ్యతను తీసుకున్న అకౌంట్స్‌ విభాగానికి చెందిన అధికారి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించటానికి కూడా అధికారులు జంకుతున్నారు. రైలు బోగీ క్యాంటీన్‌కు సంవత్సరానికి రూ.40 లక్షలు అద్దెగా ఆయన నిర్ధారించారు. ఆ మేరకు వాణిజ్య విభాగం అధికారులు టెండర్లను నిర్వహిస్తే.. అద్దె అధికంగా ఉండటంతో గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బోగీ వృథాగా పడుంది. అద్దెను తగ్గిసే లేనిపోని అనుమానాలతో రైల్వే విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నిస్తారేమోనన్న భయం వీరిలో నెలకొంది. బోగీని ఏర్పాటు చేయడానికి, దాన్ని ఏర్పాటుచేసిన ప్రదేశాన్ని తీర్చిదిద్దడానికి అధికారులు అప్పట్లోనే రూ.20 లక్షలకు పైగా వ్యయం చేశారు. ఇక్కడ బోగీని క్యాంటీన్‌గా మార్చిన వైనంపై ఇతర డివిజన్ల వారు సమాచారాన్ని తీసుకుని తమ ప్రాంతాల్లో ఇలాంటివి ఇప్పటికే ప్రారంభించినా.. గుంతకల్లులో మాత్రం అడుగు ముందుకు పడలేదు. బోగీని ప్రారంభించి ఉంటే రైలు ప్రయాణికులకు స్టేషన్‌ వెలుపల అల్పాహారాన్ని పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చేది. రైల్వేకు కూడా పెద్దఎత్తున ఆదాయం లభించేది. దీన్ని అద్దెకు ఇచ్చే విషయంలో అధికారులు తగిన నిర్ణయం తీసుకుని, వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

అనాలోచిత నిర్ణయం వల్లే..

రైలు బోగీ క్యాంటీన్‌ను ముందుగా కొన్ని నెలలపాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి వ్యాపారం ఏ మేరకు ఉంటుందో అంచనా వేయాలి. దాన్ని బట్టి అద్దెను నిర్ధారించాలి. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను చేపట్టి ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని చెబుతున్నారు. అనాలోచితంగా అధిక మొత్తంలో అద్దెను నిర్ధారించటం వల్లే.. దాన్ని తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. పర్యవసానంగా రెండేళ్లుగా దిష్టిబొమ్మలా మిగిలింది. దీనిపై సంబంధిత అధికారులను అడుగగా.. టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, అద్దెను తగ్గించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతాధికారులేనని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని