logo

విధుల నుంచి మహిళా వాలంటీరు తొలగింపు

మండలంలోని నార్శింపల్లికి చెందిన మహిళా వాలంటీరును విధుల నుంచి అధికారులు తొలగించారు.

Published : 03 Dec 2022 02:35 IST


గ్రామంలో విచారిస్తున్న అధికారులు

నార్శింపల్లి (తాడిమర్రి), న్యూస్‌టుడే : మండలంలోని నార్శింపల్లికి చెందిన మహిళా వాలంటీరును విధుల నుంచి అధికారులు తొలగించారు. శుక్రవారం ‘ఈనాడు’లో ‘పింఛన్‌ పంపిణీలో మహిళా వాలంటీరు చేతివాటం’ శీర్షిక ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై ఎంపీడీవో విజయలక్ష్మి పెద్దకోట్ల, పిన్నదరి పంచాయతీ కార్యదర్శులు రాజేంద్ర, గంగమ్మలతో గ్రామంలో విచారణ చేయించారు. అధికారులు.. ఫించను దారులతో మాట్లాడారు. వాలంటీరు లబ్ధిదారులకు నగదు తక్కువ ఇచ్చిందని గుర్తించారు. దీంతో ఎంపీడీవో వాలంటీరును విధుల నుంచి రాతపూర్వకంగా తొలగించినట్లు తెలిపారు. ఎవరైన ఇలాంటి అవినీతి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హెచ్చరించారు.


డబ్బు కాజేశారని మరొకరు...

గుంతకల్లు గ్రామీణం: గ్రామీణులు ఖాతాల నుంచి డబ్బు కాజేసినట్లు నిర్ధారణ కావటంతో ఓ వాలంటీరును విధుల నుంచి తొలగించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంతకల్లు మండలంలోని వెంకటాపల్లి గ్రామానికి చెందిన అంజి నాయక్‌ అనే వాలంటీరును విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ జాషువా శుక్రవారం చెప్పారు. గ్రామానికి చెందిన దేవమ్మ అనే మహిళ తన ఖాతా నుంచి నగదును తీసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో విచారణ చేశారు. ఈ విధంగా పలువురి ఖాతాల నుంచి దాదాపుగా రూ.3 లక్షల వరకు కాజేసినట్లు తెలిసిందన్నారు. దీంతో గత నెల 26నే వాలంటీరును విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని