logo

ప్రశ్నిస్తే పథకాలు పోయినట్లే..!

కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడం.. పారదర్శకంగా పాలన అందిస్తాం’ అంటూ.. సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి మొదలుకొని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల వరకు చెప్పేమాటలివి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.

Updated : 04 Dec 2022 05:13 IST

 గ్రామాల్లో సమస్యలపై నిలదీస్తున్న వారిపై కక్ష సాధింపు

 ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తితే భౌతిక దాడులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడం.. పారదర్శకంగా పాలన అందిస్తాం’ అంటూ.. సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి మొదలుకొని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల వరకు చెప్పేమాటలివి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఉమ్మడి అనంత జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తిన వారిపై పగ పడుతున్నారు. పశ్నించినవారి పథకాలు తొలగిస్తున్నారు. అభివృద్ధిపై నిలదీస్తే కక్ష సాధింపులకు దిగుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాముగా అభివృద్ధి పనులూ చేయాలంటే ఎలా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి దౌర్జన్యం చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ అని అడిగితే సొంత పార్టీ నేతలైనా సరే దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పదేపదే పోలీసుస్టేషన్‌కు రప్పించి మానసికంగా హింసిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలో అభివృద్ధిపై మాట్లాడాలంటేనే జనాలు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పారదర్శకంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు పక్షపాతం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.  

ప్రతిపక్షాలే లక్ష్యంగా..

గ్రామ, మండల స్థాయిలో ప్రతిపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే పంటల బీమా, పెట్టుబడి రాయితీ, ఇళ్ల పట్టాలు వంటివి రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పథకాల జాబితాలో ప్రతిపక్షాల సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుంటున్న వారి బిల్లులు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. లేని భూవివాదాలు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తర్వాత సమస్య పరిష్కారం కావాలంటే తమకు ఎంతో కొంత ఇచ్చుకోవాలని.. లేదంటే పార్టీలో చేరాలని వైకాపా నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో వైకాపా నాయకుల దౌర్జన్యాలపై అధికారులు, పోలీసులను ఆశ్రయించినా స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు.
విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో తెదేపా సానుభూతిపరులైన 10 మంది పింఛను నిలిపివేశారు. తెదేపా ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతోనే తమపై కక్ష కట్టి పింఛను అందించలేదని బాధితులు వాపోతున్నారు. ఎప్పటిలాగే ఒకటో తేదీ ఉదయం పింఛను కోసం బయోమెట్రిక్‌ వేయించుకున్న వాలంటీర్లు నగదు ఇవ్వకుండానే వెళ్లిపోయారని ఆరోపించారు.

తాడిమర్రి మండలం అగ్రహారానికి చెందిన శివయ్య ముందునుంచీ తెదేపా సానుభూతిపరుడు. నాలుగు నెలల కిందట ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో శివయ్య ఇంటిపై తెదేపా జెండా ఉండటంతో అసహనానికి గురయ్యారు. శివయ్య కుటుంబానికి వచ్చే పథకాలు నిలిపివేయాలని సిబ్బందికి ఆదేశించారు. అధికారులు వారి కుటుంబానికి రైతు భరోసా సొమ్ము నిలిపివేశారు. గ్రామంలో ఉపాధి పనులకు కూడా వారి కుటుంబాన్ని పిలవడం లేదు. ఇంటికి కుళాయి కనెక్షన్‌ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని శివయ్య వాపోతున్నారు.
గతనెల 15న గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ ‘సమస్యలు పరిష్కరించని నాయకులు మా ఇంటికి రావొద్దు’ అని ఎమ్మెల్యే ఎదుట పేర్కొన్నారు. దీంతో ఆ ఇంటికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని గ్రామ వాలంటీరుకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నేపథ్యంలో చంద్రమోహన్‌ తల్లి మంగమ్మకు పింఛన్‌ నిలిపివేశారు. కుమారుడితో సంబంధం లేకుండా అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తనకు పింఛను నిలిపివేయడం ఏమిటని మంగమ్మ వాపోతున్నారు.

‘గడపగడప’లో ముందస్తు హెచ్చరికలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజాప్రతినిధులు కేవలం సంక్షేమ పథకాలను వివరించడానికే పరిమితమవుతున్నారు. స్థానిక సమస్యలు వినకుండానే ముందుకు సాగిపోతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన కొత్తలో ఎక్కడికక్కడ సమస్యలపై స్థానికులు నిలదీశారు. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు తూతూమంత్రంగా నిర్వహించారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి హెచ్చరికలు రావడంతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే పర్యటన ముందురోజే స్థానిక నాయకులు అన్ని ఇళ్లకు వెళ్తున్నారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు అన్ని పథకాలు అందుతున్నాయని, సమస్యలేవి లేవని చెప్పమని ఆదేశిస్తున్నారు. లేదంటే వచ్చే పథకాలు కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని