logo

కాలేయ వ్యాధితో వివాహిత పోరాటం

అసలే పేదరికం.. కూలీ పనులకు వెళితే గాని కుటుంబం గడవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వివాహిత కాలేయ వ్యాధితో బాధపడుతోంది.

Updated : 07 Dec 2022 13:59 IST

ఆపన్నహస్తం అందించాలని వేడుకోలు
బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే

బెంగళూరులో చికిత్స పొందుతున్న సునీత

అసలే పేదరికం.. కూలీ పనులకు వెళితే గాని కుటుంబం గడవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వివాహిత కాలేయ వ్యాధితో బాధపడుతోంది. కాలేయ మార్పిడి చేస్తేనే ఆమె ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కతోచని స్థితిలో ఉండిపోయింది. వైద్యచికిత్సలకు దాతలు ఆపన్నహస్తం అందించాలని వేడుకొంటోంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామానికి చెందిన ఓబన్న కుమార్తె సునీతను నాలుగేళ్ల కిందట బండ్లపల్లి గ్రామానికి చెందిన తిరుపాలుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవనం సాగించేవారు. మూడు నెలల కిందట సునీత అనారోగ్యం బారిన పడింది. ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షించి కాలేయం 90 శాతం పాడైపోయిందని చెప్పారు. ఆమె వైద్యానికి కుటుంబ సభ్యులు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. వ్యాధి నయం కాకపోవడంతో బెంగళూరులో వైద్య పరీక్షలు చేయించారు. కాలేయ మార్పిడి చేస్తేనే సునీతను కాపాడగలమని, అందుకు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఆర్డీటీ సంస్థను సంప్రదించగా వైద్య ఖర్చులకు రూ.10 లక్షల వరకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమె పరిస్థితి చూసి గ్రామస్థులు రూ.లక్ష వరకు సాయం అందించారు. దాతలు స్పందించి ఆర్థిక చేయూత అందించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని