logo

వ్యాపార గదుల ఆదాయం.. పాలకులకు ఫలహారం

జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన మేజరు పంచాయతీల్లో కొత్తచెరువుకు ప్రత్యేక స్థానం ఉంది.

Updated : 07 Dec 2022 04:31 IST

రూ.40 లక్షల నిధుల గోల్‌ మాల్‌

కొత్తచెరువు మేజరు పంచాయతీ కార్యాలయం

కొత్తచెరువు, న్యూస్‌టుడే : జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన మేజరు పంచాయతీల్లో కొత్తచెరువుకు ప్రత్యేక స్థానం ఉంది. మేజరు పంచాయతీకి 48 గదుల వాణిజ్య సముదాయం, వారపు సంత, దిన సంత, బస్టాండుల నుంచి ఏటా రూ.కోటికి పైగా వార్షిక ఆదాయం సమకూరుతోంది. బాధ్యతగా పాలన చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, కొందరు తాత్కాలిక ఉద్యోగులు, పాలకులు కుమ్మక్కై పంచాయతీ ఆదాయాన్ని నీకింత.. నాకింత అని పంచుకుని జేబులు నింపుకొంటున్నారు. పంచాయతీకి జమ చేయాల్సిన రూ.81 లక్షల నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలతో ఏడాదిన్నర క్రితం పంచాయతీ కార్యదర్శిని, ఏడు నెలల క్రితం జూనియర్‌ సహాయకున్ని సస్పెండ్‌ చేశారు. వరుసగా ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారన్న బలమైన ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైనా అక్రమాలు మాత్రం ఆగడంలేదు. పంచాయతీలో పన్నులు వసూలు చేయాల్సిన బిల్‌ కలెక్టర్‌ రెండేళ్లుగా కార్యాలయం నుంచి కదలడంలేదు. కొందరు తాత్కాలిక సిబ్బంది సహకారంతో రోజువారి వసూళ్ల దందా కొనసాగుతోంది. వసూలైన పన్నుల మొత్తం ఏరోజుకారోజు చలానా తీసి పంచాయతీ ఖాతాకు జమ చేయాల్సి ఉండగా.. అలా చేయకుండా స్వాహాకు పాల్పడటం బహిరంగ రహస్యమే. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

నాలుగేళ్లుగా అద్దె సొమ్ము స్వాహా

నాలుగేళ్లుగా ఎస్సీలకు రిజర్వు చేసిన నాలుగు గదులకు వేలం నిర్వహించలేదు. రిజర్వుడ్‌ గదులను రికార్డుల్లో నమోదు చేయలేదు. అద్దెకు అప్పగించి.. 48 నెలలుగా అద్దె మొత్తం పంచాయతీ ఖాతాకు జమకాలేదు. ప్రజాధనం పరులపాలవుతోందనడానికి ఇది నిదర్శనం. దీనిపై దీనిపై ఎంపీడీవో సిద్ధారెడ్డిని వివరణ కోరగా రికార్డులు అందుబాటులో లేని విషయం పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. పూర్తి విచారణతోనే అక్రమాలు ఎంతమేరకు జరిగాయన్నది నిర్ధారణ అవుతుందన్నారు.

రూ.లక్షల్లో మింగేశారు..

పంచాయతీ వ్యాపార సముదాయంలో 48 గదులున్నాయి. మూడేళ్ల కిందట బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో గదికి నెలసరి అద్దె అతి తక్కువ రూ.2,500, అత్యధికంగా రూ.27 వేల వరకూ వేలంలో పోటీపడి వ్యాపారులు దక్కించుకున్నారు. ప్రతినెలా కాంప్లెక్స్‌ గదుల నుంచి రూ.4.58 లక్షల ఆదాయం సమకూరుతోంది. అంటే ఏటా రూ.54.96 లక్షలు పంచాయతీ ఖాతాకు జమకావాలి. పాలకుల చేతివాటం కారణంగా 2002-23కు గాను 50 శాతం అద్దె కూడా ఖాతాకు జమకాలేదు. రెండున్నరేళ్ల కాల పరిమితి ముగిసి ఆరు నెలలు కావస్తున్నా నేటికీ గదుల వేలానికి మీనం మేషాలు లెక్కిస్తున్నారు. గదుల అద్దె దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసినా నేటికీ ఖాతాకు జమ చేయకపోవడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇంకా రూ.20 లక్షల మొత్తం చెల్లించాలని గదుల్లోని వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి గోపాల్‌ పేర్కొంటున్నారు.

సరిదిద్దుకోలేని అవకతవకలు జరిగాయి

నాలుగు నెలల క్రితం విధుల్లో చేరా. పంచాయతీలో రికార్డుల నిర్వహణ సరిగా లేదు. ఇటీవల కొన్నింటినీ మాత్రమే నాకు అప్పగించారు. ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. పంచాయతీ లావాదేవీలను గాడిలో పెట్టడానికి పాలకవర్గం నుంచి తగిన సహకారంలేదు. గతంలో పనిచేసిన వారి కారణంగా సరిదిద్దుకోలేని అవకతవకలు జరిగాయి.

గోపాల్‌, పంచాయతీ కార్యదర్శి, కొత్తచెరువు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని