logo

ధర్మవరంలో పని చేయలేం!

ధర్మవరంలో ఉన్నతాధికారులు వరుసగా సెలవుపై వెళుతున్నారు. పాలనాపరమైన విషయాల్లో ప్రజాప్రతినిధుల జోక్యం అధికం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Published : 07 Dec 2022 04:15 IST

సెలవుపై ఉన్నతాధికారులు

ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం

ధర్మవరం, ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ధర్మవరంలో ఉన్నతాధికారులు వరుసగా సెలవుపై వెళుతున్నారు. పాలనాపరమైన విషయాల్లో ప్రజాప్రతినిధుల జోక్యం అధికం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి అదేబాట పట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, సెబ్‌ సీఐ సైదులు సెలవులో ఉన్నారు. అధికారులు వరుసగా సెలవుపై వెళ్లడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో భాజపా నాయకులపై వైకాపా శ్రేణులు మూకుమ్మడి దాడి చేసిన కేసులో నిందితులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ రమాకాంత్‌ అరెస్టు చేయించారు. దీంతో ముఖ్య ప్రజాప్రతినిధి, డీఎస్పీ మధ్య కొంతకాలంగా మాటల్లేవు. ఈ క్రమంలోనే డీఎస్పీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. పట్టణ పరిధిలో రూ.కోట్ల విలువైన స్థలం విషయంలో తహసీల్దార్‌ నీలకంఠారెడ్డిపై ప్రజాప్రతినిధి ఒత్తిడి తీసుకురావడం వల్లే సెలవుపై వెళ్లినట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు బెంగళూరు నుంచి మద్యం సీసాలు కారులో తెస్తుండగా సెబ్‌ సీఐ సైదులు పట్టుకుని వాహనాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రజాప్రతినిధి ఏకంగా సెబ్‌ కార్యాలయం వద్దకే అర్ధరాత్రి వెళ్లి చిందులు తొక్కినట్లు సమాచారం. ఆతర్వాత కొద్ది రోజులకే సెబ్‌ సీఐ తనను కొట్టాడని వాహన డ్రైవర్‌ బాబావలి ధర్మవరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సెబ్‌ సీఐపై కేసు నమోదైంది. దీంతో ఆయన మనస్తాపానికి గురై సెలవు పెట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌తో ఛైర్‌పర్సన్‌ నిర్మలకు కొంతకాలంగా పాలనాపరమైన విషయాల్లో విభేదాలు నెలకొన్నాయి. కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు కొందరు కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌కు మద్దతుగా నిలిచారు. మూడు నెలలుగా పురపాలక సమావేశాల్లో కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. కమిషనర్‌కు ముఖ్య ప్రజాప్రతినిధి అండ కొంతకాలం ఉన్నా పురపాలక సమావేశాల్లో ఆయనను టార్గెట్‌ చేస్తుండటంతో దీర్ఘకాలిక సెలవు పెట్టినట్లు సమాచారం. ధర్మవరంలో పనిచేసేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా బత్తలపల్లి తహసీల్దార్‌ యుగేశ్వరిని నియమించేందుకు ప్రజాప్రతినిధి రెవెన్యూ ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని