logo

వేరుసెనగ రైతు నిలువు దోపిడీ

అరకొరగా పండిన పంటను అమ్ముకుందామనుకున్న వేరుసెనగ రైతులు వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు.

Published : 07 Dec 2022 04:15 IST

తరుగు, శాంపిల్స్‌, తూకాల్లో మోసాలు

రైతులకు కిలోలు కనిపించకుండా సంచుల తూకాలు

రాయదుర్గం, కళ్యాణదుర్గం, కుందుర్పి, న్యూస్‌టుడే: అరకొరగా పండిన పంటను అమ్ముకుందామనుకున్న వేరుసెనగ రైతులు వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు తరుగు, హమాలీ ఛార్జీలు వసూలు చేస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వేరుసెనగ ఆశించినస్థాయిలో పండితే పొరుగునే ఉన్న కర్ణాటకలోని చెళ్ళకెర, బళ్ళారి తదితర మార్కెట్‌లకు తరలిస్తారు. భారీ వర్షాలు, తెగుళ్లతో 30 శాతం మేర మాత్రమే దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున 400 కిలోలకుగాను 200 కిలోలు వచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా వంద కిలోలు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు తీసుకెళితే రవాణా, హమాలీ, ఇతరత్రా ఖర్చులతో పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని రాయదుర్గంలోనే విక్రయిస్తున్నారు. బయట క్వింటాలు రూ.7వేలకుపైగా పలుకుతుండగా కాయలు లొత్తలుగా, పచ్చిగా, నాసిరకం ఉన్నాయని వ్యాపారులు రూ.6,500లోపునే కొనుగోలు చేస్తున్నారు.

* రాయదుర్గంలో తరుగుపేరుతో 40 కిలోల బస్తాకు 3 కిలోల వరకు తీస్తున్నారు. ఈ లెక్కన క్వింటాలుకు రూ.500 వరకు దోపిడీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ తూకపు యంత్రాల్లో కిలోల తర్వాత 900 గ్రాములు వచ్చినా లెక్కలోకి తీసుకోవడంలేదు.

చేతులెత్తేసిన అధికారులు..

మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు జరుపుతామంటూ అధికారులు ప్రకటించినా దిగుబడి లేదంటూ చేతులెత్తేశారు. ఏపీ ఆయిల్‌ఫెడ్‌, ఆయిల్‌ సీడ్స్‌ కంపెనీలు ముందుకు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో స్థానికంగా ఉన్న వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఆర్బీకేలు కూడా నిరుపయోగమయ్యాయి. శాంపిల్స్‌, తరుగు, తూకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నా యార్డు అధికారులు, తూనికలు, కొలతలు, ఇతరశాఖల అధికారులు ఎవరూ తొంగిచూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షానికి రంగుమారిన విత్తనాలు

పొలాలకు వెళ్లి..

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పొలంలోనే తూకాలుపట్టి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు రూ.5,600 నుంచి రూ.6వేల వరకు తీసుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు 44 కిలోల వరకు తూకం వేసుకుంటున్నారు. రివాజ్‌ కింద 4 కిలోలు తీసివేసి రైతుకు 40 కిలోలకే నగదు చెల్లిస్తారు.

బిల్లులు ఇవ్వరు..

కాయలు నింపే సంచిని వ్యాపారులు ఇస్తే ఒక్కోదానికి రూ.10, హమాలీకి మరో పది రూపాయలను రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ట్రేడర్‌ పేరిట ఎలాంటి బిల్లులు ఇవ్వరు. వ్యాపారమంతా తెల్లకాగితం పైనే ఉంటుంది.


సిండికేట్‌గా మారి..

-మహాలింగప్ప, రుద్రంపల్లి, కుందుర్పి మండలం

ఖరీఫ్‌లో నాలుగెకరాల్లో వేశాను. 16 క్వింటాళ్లు వచ్చాయి. పొలంలోనే దళారులకు క్వింటాలు రూ.5,500 చొప్పున విక్రయించాను. క్వింటాలుకు సుమారు 6 నుంచి 7 కిలోల వరకు రివాజ్‌ అంటూ తీసేసుకుంటున్నారు. సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు