logo

సాయం అందక,,,పూట గడవక!

నా భర్త మంజునాథ మే 20న అనారోగ్యంతో మృతి చెందారు. మాకు ఇద్దరు పిల్లలు. భర్త చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశా. ఆయన మరణంతో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది

Updated : 08 Dec 2022 04:55 IST

 వైఎస్సార్‌ బీమా చెల్లింపులో నిర్లక్ష్యం 

బాధితులకు దక్కని భరోసా

 

కూలీకి వెళ్తేనే జీవనం

 లక్ష్మీ, ఆర్‌.కొత్తపల్లి, గుమ్మఘట్ట

నా భర్త మంజునాథ మే 20న అనారోగ్యంతో మృతి చెందారు. మాకు ఇద్దరు పిల్లలు. భర్త చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశా. ఆయన మరణంతో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కూలీ పనులకు వెళుతున్నా. పిల్లల పోషణ భారంగా మారింది. ఒక్కరోజు కూలీకి వెళ్లకపోయినా పూటగడవని పరిస్థితి. వైఎస్‌ఆర్‌ బీమా వస్తుందని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నా.
ఆరు నెలలైనా చిల్లిగవ్వ అందలేదు.      


బెంగళూరుకు వలస వెళ్లా

నా భర్త అక్కిశెట్టి డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవారు. ఆరు నెలల కిందట అనారోగ్యంతో మరణించాడు. స్థానికంగా కూలీ పనులు లభించకపోవడంతో ఇద్దరు పిల్లలను మా అమ్మవద్ద వదిలి బెంగళూరుకు వలస వచ్చా. గ్రామానికి చెందిన యానిమేటర్‌ నా భర్తకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఆరు నెలలు గడిచినా సాయం అందలేదు.

అనురాధ, గంగినేపల్లి, చెన్నేకొత్తపల్లి


అనంతపురం జిల్లాలో ఈఏడాది సహజ మరణం పొందిన కుటుంబాలకు ఇప్పటివరకు సాయం అందలేదు. మొత్తం 500 కుటుంబాలకు రూ.5 కోట్లు రావాల్సి ఉంది. ప్రమాదాల్లో ఈ ఏడాది 78 మంది చనిపోగా.. 19 కుటుంబాలకు మాత్రమే బీమా పరిహారం అందింది. 59 కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. వీరికి రూ.2.95 కోట్లు అందాలి. శ్రీసత్యసాయి జిల్లాలో 2021-22కు సంబంధించి 957 మంది సహజ మరణం పొందగా.. 534 బాధిత కుటుంబాలకు రూ.5.34 కోట్ల సాయం పెండింగ్‌లో ఉంది. అదే ఏడాదిలో ప్రమాదంలో మృతి చెందిన 21 మంది కుటుంబాలకు రూ.1.05 కోట్లు అందాల్సి ఉంది. 2022-23కు సంబంధించి శ్రీసత్యసాయి జిల్లాలో 453 మంది సహజ మరణం పొందగా.. ఒక్క కుటుంబానికీ బీమా సొమ్ము జమ కాలేదు. రూ.4.53 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రమాదాల్లో చనిపోయిన 9 మందికి రూ.45 లక్షలు అందాలి. రెండు జిల్లాలో కలిపి 1067 బాధిత కుటుంబాలకు రూ.19.32 కోట్లు వైఎస్సార్‌ బీమా పరిహారం రావాల్సి ఉంది.


ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే 15 రోజుల్లోగా వైఎస్సార్‌ బీమా చెల్లిస్తాం. మొత్తం నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తాం. కేంద్రం కోత విధించిన 50 శాతం వాటాను కూడా మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గతంతో పోలిస్తే బీమా సాయం పెంచాం’ అంటూ ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతూ వచ్చారు. బీమా సొమ్ము మంజూరులో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బాధితులు ఎంతోమంది సాయం కోసం నెలలుగా ఎదురుచూస్తున్నారు. అధికారులు వివరాలు నమోదు చేసుకుని ఏడాది దాటినా పరిహారం అందలేదు. సాయం ఎప్పుడు అందుతుందో తెలియక పొట్టకూటి కోసం కొందరు వలస వెళ్లారు. మరికొందరు రోజువారీ కూలీలుగా జీవిస్తున్నారు.

కొడుకు చదువు మాన్పించా

నా భర్త బెస్త రామచంద్ర మే 28న అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు హర్ష, కుమార్తె హారతి ఉన్నారు. ఇళ్లల్లో పాచిపనులు చేసి పిల్లల్ని పోషిస్తున్నా. నా కుమారుడు ఇంటర్‌ పూర్తి చేశాడు. పై చదువులు చదివించలేక మాన్పించేశా. కుమార్తె ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. సచివాలయ సిబ్బంది నా భర్త వివరాలు నమోదు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా బీమా నగదు జమ కాలేదు.  

సుంకమ్మ, ఆత్మకూరు


వివరాలు పంపించాం
- నరసింహారెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ

వైఎస్సార్‌ బీమాకు సంబంధించి బాధిత కుటుంబాల వివరాలను సచివాలయాల వారీగా నమోదు చేశాం. విడతల వారీగా ఖాతాల్లో జమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో సుమారు 500 మందికి బీమా సొమ్ము రావాల్సి ఉంది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బీమా సంస్థల నుంచి నేరుగా సాయం అందుతుంది. మిగిలిన వారికి త్వరలోనే జమ చేస్తారు.

ఏడాదిన్నరగా నిరీక్షణ

కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే.. సహజ మరణానికి రూ.లక్ష బీమా అందిస్తారు. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేస్తారు. సహజ మరణాలకు సంబంధించి బాధితులు ఏడాదిన్నరగా బీమా సొమ్ము కోసం ఎదురుచూస్తున్నాయి. క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. నిబంధనల మార్పుతో చాలా కుటుంబాలు బీమాకు దూరమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఇద్దరికి బీమా వర్తింపజేశారు. ప్రస్తుతం కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని