logo

చెప్పింది వింటారా బదిలీపై వెళతారా!

అధికారులపై వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు.

Updated : 09 Dec 2022 12:49 IST

అధికారులకు వైకాపా నాయకుల బెదిరింపులు


శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ మున్సిపల్‌ కమిషనర్‌ 22 రోజులపాటు సెలవు పెట్టారు. స్థానిక కౌన్సిలర్ల ఒత్తిడి తట్టుకోలేకనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఓ వార్డు కౌన్సిలర్‌, కమిషనర్‌ మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధికి ఇరువురు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి కౌన్సిలర్‌కు వత్తాసుగా మున్సిపల్‌ కమిషనర్‌ను మందలించినట్లు సమాచారం. మనస్తాపానికి గురైన అధికారి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రజాప్రతినిధి అనుచరుడి సమీప బంధువుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.


ధర్మవరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ పోలీసు అధికారిని ఇటీవల వీఆర్‌కు పంపించారు. ముందునుంచీ ఆ అధికారి స్థానిక ప్రజాప్రతినిధికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొన్ని విషయాల్లో తమ మాట వినలేదని వైకాపా నాయకులు కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై దాడి విషయంలో ప్రజాప్రతినిధి అనుచరులపై కేసు నమోదు చేశారు. వారు ముందస్తు బెయిల్‌ ప్రయత్నాల్లో ఉండగానే ఆరెస్టు చేయడంతో సదరు అధికారిపై
కోపం పెంచుకున్నట్లు తెలిసింది.


శ్రీసత్యసాయి జిల్లాలో మద్యం, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ సీఐను బదిలీ చేయించారు. ఆయన వాహనం డ్రైవర్‌తోనే కేసు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారు. అయినా తమ దారికి రాకపోవడంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఇతర ప్రాంతానికి బదిలీ చేయించారు.


ఉరవకొండ నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకుల భూఅక్రమాలకు రెవెన్యూ అధికారులు బలవుతున్నారు. ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటేనే భయపడుతున్నారు. ఉరవకొండ, కూడేరు మండలాల్లో తహసీల్దార్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విడపనకల్లు ఈవోఆర్డీ వజ్రకరూరు మండల ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయంతో ఆయన్ను బదిలీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో పనిచేసే ఓ సీఐపై అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. గతంలో సీఐపై ఒత్తిడి తెచ్చి సెలవుపై వెళ్లేలా చేశారు. తర్వాత కొద్దిరోజులకు ఆ సీఐ అక్కడికే పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. తనకు ఇష్టం లేకుండా నియోజకవర్గంలో ఎలా పనిచేస్తారంటూ.. మళ్లీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని సీఐపై స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.


ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అధికారులపై వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అనుచరులు, అయినవారి లబ్ధి కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులను కూడా చేసి పెట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. ఆరు నూరైనా చెప్పింది చేసి తీరాలని పట్టుబడుతున్నారు. మాట వినకపోతే సెలవుపై వెళ్లాలని, లేదంటే తామే బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్నారు.

వేటు తప్పదంటూ హెచ్చరిక

మాట వినని పక్షంలో బదిలీ తప్పదంటూ అధికారులను బెదిరిస్తున్నారు. ముఖ్యంగా కిందిస్థాయి సిబ్బందిపై వైకాపా నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. మండల పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే నడుచుకోవాలి. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని మండలాల్లో తమకు తెలియకుండా మ్యుటేషన్లు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కౌన్సిలర్లకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయకూడదు. భూవివాదాలకు సంబంధించి తమ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోకూడదని ఆదేశాలిస్తున్నారు. సాగు పట్టాల పంపిణీ నేపథ్యంలో ఈ తరహా ఒత్తిళ్లు రెవెన్యూ సిబ్బందిపై ఎక్కువయ్యాయి.

పోలీసులపైనా పెత్తనం

శాంతి భత్రతల పరిరక్షణ పోలీసుల విధి. కుల, మతాలు, రాగద్వేషాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయాలి. ఆ దిశగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై వైకాపా నాయకుల పెత్తనం ఎక్కువైంది. పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉన్న ప్రతి కేసులో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించాలని, ఫిర్యాదులు చేయకుండానే ప్రత్యర్థి పార్టీ నేతల్ని అరెస్టు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడానికి వీలు లేదని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు