logo

శేషజీవితంలోనూ కన్నీరే

నాలుగు దశాబ్దాలకుపైగా ప్రజా సేవకు అంకితమయ్యారు.. ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు.

Published : 09 Dec 2022 06:18 IST

పింఛన్‌దారులపై కరుణ ఏదీ?

జిల్లా సచివాలయం, కళ్యాణదుర్గం గ్రామీణం, తాడిపత్రి, కదిరి, న్యూస్‌టుడే: నాలుగు దశాబ్దాలకుపైగా ప్రజా సేవకు అంకితమయ్యారు.. ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు. శేష జీవితాన్ని హాయిగా.. ఆనందంగా గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. సకాలంలో పెన్షన్‌ సొమ్ము అందక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా 18 ఖజానా ఉప కార్యాలయాల పరిధిలో 38 వేల మంది ప్రభుత్వ పెన్షన్‌దారులు ఉన్నారు. వీరందరూ పెన్షన్‌ సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆరు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పెన్షన్‌ చెల్లించడం లేదు. ఈ నెల ఎనిమిది రోజులు గడిచినా సొమ్ము అందలేదు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపడం లేదు.

దీర్ఘకాలిక జబ్బులతో సతమతం

వయసు మీదపడే కొద్దీ అనేక రకాల దీర్ఘకాలిక జబ్బులు వేధిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు(బీపీ), పక్షవాతం, కీళ్లనొప్పులు, అసిడిటీ, గ్యాస్ట్రిక్‌, కండరాల నొప్పి, తల తిరగడం, మెడనొప్పి.. ఇలా పలు రుగ్మతలు వెంటాడుతాయి. నిత్యం మందులు వాడితేనే ఉపశమనం కలుగుతుంది. మరోవైపు శస్త్ర చికిత్సలు, ఇంటి అద్దె, సరకులు, ఈఎంఐ (కంతులు) చెల్లింపులకూ ఇబ్బందులు తప్పడం లేదు.


ప్రతి నెలా ఎదురుచూపులే

పింఛను సొమ్ము కోసం ప్రతి నెలా ఎదురుచూడాల్సి వస్తోంది. సకాలంలో అద్దె, బ్యాంకు రుణ కంతులు చెల్లించలేకపోతున్నాం. అప్పులు చేసి నిత్యావసర సరకులు కొనాల్సి వస్తోంది. విశ్రాంత ఉద్యోగులంతా నిత్యం ఆరా తీస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మాలాంటి పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ప్రభుత్వం స్పందించి ఒకటో తేదీన సొమ్ము ఇవ్వాలి.

- లక్ష్మీనారాయణరెడ్డి, నియోజకవర్గ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు, తాడిపత్రి


పింఛన్‌ సొమ్మే ఆధారం

నా భర్త నారాయణప్ప పశుసంవర్ధక శాఖలో లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ మరణించారు. ఆయన ద్వారా వస్తున్న పింఛన్‌ మొత్తంతోనే కుటుంబం ఆధారపడ్డాం. నెలకు రూ.20 వేలు పెన్షన్‌ వస్తోంది. నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. నెలకు రూ.8 వేలు ఔషధాల కోసం ఖర్చు చేస్తున్నా. కుమారుడు, కుమార్తె చదువులు, కుటుంబ పోషణ కష్టమైంది. పింఛన్‌ సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. జీవనం కష్టంగా మారుతోంది.

- రామకృష్ణమ్మ, కోటవీధి, కళ్యాణదుర్గం


ఔషధాలు కొనలేని దుస్థితి

నేను కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ 2009లో పదవీ విరమణ పొందా. నెలకు రూ.17 వేలు పెన్షన్‌ వస్తోంది.  ఈనెల ఇప్పటికీ రాలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. నా కాలుకు ఆపరేషన్‌ జరిగింది. ఛాతి నొప్పికి చికిత్స చేయించుకుంటున్నా. నాకు, నా భార్యకు కలిపి నెలకు రూ.6 వేల వరకు మాత్రలకు ఖర్చు చేస్తున్నా. పింఛన్‌ సొమ్ము అందక మందులు కొనుగోలు చేయలేకపోతున్నా. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.

- రషీద్‌, రెవెన్యూ కాలనీ, కళ్యాణదుర్గం


రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి

ఉద్యోగ విరమణతో విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన సమయంలో పింఛను సొమ్ముకు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రతినెలా వారం, పదిరోజులు దాటందే జమ కావటం లేదు. ఈ పరిస్థితి ఏడాదిగా నెలకొంది. మాకు బయట అప్పులు ఇవ్వరు. పింఛనుపై తీసుకున్న బ్యాంకు రుణ కంతులు ఆలస్యంతో రూ.వేలల్లో అపరాధ రుసుం కట్టాల్సి వస్తోంది. విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వానికి కనికరం లేదు.

- ఆత్మారెడ్డి, విశ్రాంత ఉద్యోగి,  కదిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని