logo

తెల్లకాగితాలూ కరవాయె!

ఖరీఫ్‌ సీజన్‌లో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారన్న వివరాలు ఈ-పంట యాప్‌లో నమోదు చేశారు.

Published : 09 Dec 2022 06:17 IST

పంట వివరాల పత్రాల జారీలో జాప్యం
ఆర్బీకేల్లో ప్రింటర్లు లేక అవస్థలు


ఖరీఫ్‌ సీజన్‌లో ఈ-పంట నమోదు చేసిన రైతులకు సంబంధించి భూమి విస్తీర్ణం, పంటల వివరాలతో కూడిన పత్రం అందించాల్సి ఉంది. దీనిని ప్రింట్‌ తీసి ఇచ్చే బాధ్యత ఏఈవోలదే. కార్యాలయాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు లేవు. నిధులు ఇవ్వక పోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


పుట్టపర్తి ఆర్బీకే పరిధిలో 647 మంది రైతులు ఉండగా.. 598 మందికి పత్రాలు ఆన్‌లైన్‌లో వచ్చాయి. నేటికీ పంపిణీ చేయలేదు.60 మందికి మాత్రమే చరవాణులకు సమాచారం వచ్చింది. ఆర్బీకే సిబ్బంది త్వరలో సభలు నిర్వహించి పత్రాలు అందజేస్తామని చెబుతున్నారు.


చిలమత్తూరు ఆర్బీకేలో 6,694 మంది రైతులు ఈక్రాప్‌ నమోదు చేయగా.. 6,215 మందికి సంబంధించి ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌లో ఉంచారు. వాటిని ప్రింట్‌ తీసి పంపిణీ చేయాల్సి ఉంది.


జిల్లా వ్యవసాయం, పుట్టపర్తి, హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌లో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారన్న వివరాలు ఈ-పంట యాప్‌లో నమోదు చేశారు. ఈ వివరాలతో కూడిన ప్రామాణిక పత్రం రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఈ పత్రం రైతు భరోసా, పంటల బీమా, పెట్టుబడి రాయితీ, పంట ఉత్పత్తుల మద్దతు ధర, కొనుగోలు, సున్నావడ్డీ తదితర పథకాలకు ఉపయోగపడుతుంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి, పంట చేతికి వచ్చినా నేటికీ పత్రాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతు భరోసా కేంద్రాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు వ్యవసాయశాఖ సరఫరా చేసినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సగం సామగ్రి కూడా అందలేదు. మరోవైపు సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమై జాప్యం చేస్తున్నారు.

సిబ్బందికి కష్టాలు

ప్రామాణిక పత్రాలను ఆర్బీకేల్లోనే ప్రింట్లు తీసి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రింటర్లు, కంప్యూటర్లు, తెల్లకాగితాల్లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. అనంత జిల్లాలో 451 రైతు భరోసా కేంద్రాలు ఉండగా, తొలి విడతలో 92 కేంద్రాలకే సామగ్రి పంపిణీ చేశారు. గతంలో ఫోన్‌ బిల్లులు, ఆర్బీకే ఖర్చులు ఇవ్వలేదు. ఇప్పుడు తెల్లకాగితాలకు తమపై రుద్దుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సామగ్రి సరఫరా చేసి, పని పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. కొన్నిచోట్ల మండల వ్యవసాయాధికారులు ప్రతిష్టాత్మంగా తీసుకుని సొంత ఖర్చులతో పత్రాలు ఇస్తున్నారు.

* అనంత జిల్లాలో ఖరీఫ్‌లో 3,12,551 మంది రైతులు 2,87,733 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఈ-పంట నమోదు 111 శాతం పూర్తయింది. ఈ-పంట నమోదు చేసిన తక్షణమే పత్రాలు పంపిణీ చేయాలని తొలుత నిర్ణయించారు. సాంకేతిక సమస్య, సామగ్రి లేక నవంబరు నుంచి ప్రక్రియ చేపట్టారు.

* శ్రీసత్యసాయి జిల్లాలో 2,34,737 మంది రైతులకు పత్రాలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 10 శాతం మందికి కూడా పంపిణీ చేయలేదు.

అర్హులందరికీ ఇస్తాం

ఈ-పంట నమోదు వందశాతం పూర్తి చేశాం. ప్రతి రైతుకు పంట వివరాలతో కూడిన ప్రామాణిక పత్రం పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రింటర్లు, కంప్యూటర్లు జిల్లాకు వచ్చాయి. ఆర్బీకేలకు సరఫరా చేశాం. పత్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

- చంద్రనాయక్‌, వ్యవసాయాధికారి, అనంతజిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని