logo

‘జగన్‌కు సీబీఐ అంటే భయం’

‘విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం నోరు మెదపడం లేదు. ఆయనపై సీబీఐ కేసులు ఉండటమే కారణం.

Published : 26 Jan 2023 03:46 IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం నోరు మెదపడం లేదు. ఆయనపై సీబీఐ కేసులు ఉండటమే కారణం. తననో, తన తమ్ముడు అవినాష్‌రెడ్డిని ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో మౌనం వహిస్తున్నారు. ఈ పరిశ్రమ కోసం రెండేళ్లుగా సుదీర్ఘ పోరాటం సాగుతోంది. కేంద్రం మెడలు వంచడానికి ప్రజా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట రిలేదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం అదానీ, అంబానీల కోసమే ఈ పరిశ్రమను అమ్మాలని నిర్ణయించారని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది విమర్శించారు. ఈనెల 30న విశాఖ నగరంలో భారీ ఎత్తున కార్మిక గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌ మాట్లాడుతూ విశాఖ పరిశ్రమను ప్రైవేటీకరణ నుంచి రక్షించేందుకు ప్రజా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. దీక్షా శిబిరంలో శ్రీసత్యసాయి జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్య యాదవ్‌, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ గౌడ్‌, సీపీఐ జిల్లా నాయకులు లింగమయ్య, రమణయ్య, కేశవరెడ్డి, పద్మావతి, నాగరాజు, అల్లీపీరా, నగర నాయకులు శ్రీనివాసులు, రామాంజినేయులు, రజాక్‌, చాంద్‌బాషా, గాదిలింగ, ప్రసాద్‌, ఖుర్షిద్‌, నాగప్ప, మున్నా, ఆచారి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని