logo

వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు తథ్యం

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 04:33 IST

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో బాలకృష్ణ

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఊరేగింపుగా వస్తూ..

హిందూపురం అర్బన్‌ న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా గురువారం హిందూపురానికి వచ్చిన ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. సాయంత్రం పట్టణంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నమార్కెట్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మెయిన్‌ బజార్‌ మీదుగా సాగగా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ కూడలిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి పాలన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తారని, దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పరిశ్రమల స్థాపన లేదని ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్‌ ఈ ప్రాంతానికి పారిశ్రామికవాడ తీసుకొచ్చారని, చంద్రబాబు ముందుచూపుతో కియా పరిశ్రమ తీసుకొచ్చారని గుర్తు చేశారు. నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న హిందూపురానికి గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని తెచ్చి పట్టణంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని వివరించారు. పార్టీ నాయకులు జేపీకే రాము, డీఈ రమేష్‌కుమార్‌, రాఘవేంద్ర, చంద్రమోహన్‌, శివకుమార్‌, జయసింహ, నబిరసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

లేపాక్షి మండలం గలిబిపల్లిలో రహదారి పనులు ప్రారంభిస్తున్న బాలయ్య

కళ్లుండి చూడలేని ప్రభుత్వమిది

లేపాక్షి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం కళ్లుండి చూడలేని.. చెవులుండి వినలేని ధీనస్థితిలో ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడా బీటీ రహదారుల నిర్మాణాలు చేపట్టలేదని, కనీసం గుంతలను మట్టితో పూడ్చలేదన్నారు. లేపాక్షి మండలంలోని గలిబిపల్లికి వెళ్లే రహదారి నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి స్వయంగా పొక్లెయిన్‌ను నడిపి అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని రహదారులన్నీ పూర్తి చేయాలనే తలంపుతో రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. అప్పట్లో గలిబిపల్లి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ నిధులు రూ.35 లక్షలతో రహదారిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్‌ జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్‌కుమార్‌, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు