logo

జీవో ఒకటి దుష్ట చట్టం

ప్రజాస్వామిక హక్కులను కాలరాసే దుష్ట చట్టం జీవో ఒకటిని సీఎం జగన్‌ బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు.

Published : 27 Jan 2023 04:33 IST

బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండు

అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామిక హక్కులను కాలరాసే దుష్ట చట్టం జీవో ఒకటిని సీఎం జగన్‌ బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలు, ప్రజా, కార్మిక, కర్షక సంఘాలు, పౌరహక్కుల నాయకులు సభలు సమావేశాలు, ర్యాలీలు తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ఒకటిపై గురువారం అనంతపురంలో వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర వాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు దాదాగాంధీ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి సరిపూటి రమణ, ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జిల్లా కేంద్రంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌ వద్దనున్న కార్పొరేషన్‌ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామ్యం అడ్రస్‌ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలను హింసించే జీవోను తెచ్చి ప్రజా హక్కులను కాలరాసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వాదులను గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడమే కాకుండా వారి కార్యక్రమాలను అడ్డుకోవడం జగన్‌ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ జీవో తీసుకురావడంపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వైకాపా ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాయన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని, లేనిపక్షంలో సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించి చీకటి జీవో రద్దుకు సమైక్య పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని