logo

అభివృద్ధిలో జిల్లాను అగ్ర పథాన నిలుపుదాం

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను అభివృద్ధిలో అగ్ర పథాన నిలుపుదామని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Updated : 27 Jan 2023 05:15 IST

అట్టహాసంగా సాగిన గణతంత్ర వేడుకలు

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను అభివృద్ధిలో అగ్ర పథాన నిలుపుదామని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం సిరసాని హిల్స్‌ పోలీసు పరేడ్‌ మైదానంలో 74వ గణతంత్ర దిన వేడుకలను జిల్లా అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు వాహనంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌తో కలిసి పరేడ్‌ మైదానంలో సైనిక వందనం స్వీకరించారు. భారతదేశ స్వాతంత్య్రం, రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిన ఎంతోమంది మహనీయుల త్యాగాలు, వారి సేవలను మననం చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి జాతీయ పతాకానికి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతి నివేదికను సభలో చదివి వినిపించారు. జిల్లాలో 2.69 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రెండు విడతలుగా రూ.308 కోట్లు ఇచ్చామని, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లీనిక్‌ల రాకతో గ్రామస్వరాజ్య స్థాపన జరిగిందన్నారు. ఉచిత పంటల బీమా కింద 2159 మంది రైతులకు రూ.10.70 కోట్లు, సున్నా వడ్డీకింద 1,29,291 మందికి రూ.25.43 కోట్లు, స్వయంసహాయక సంఘం సభ్యులకు రెండు విడతలుగా 46,653 మందికి రూ.361.17 కోట్లు వారి ఖాతాలకు జమ చేశామన్నారు. అమ్మఒడి కింద ఈ విద్యా సంవత్సరం 1,66,441 మంది తల్లుల ఖాతాలకు రూ.249.66 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 5054 నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.16,456 కోట్లతో 48 భారీ, మెగా పరిశ్రమలు స్థాపించామని ఈ ఏడాది జులై నాటికి రూ.14.22 కోట్ల పెట్టుబడితో 132 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ పథకం కింద 3039 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, ఆయా పరిశ్రమల్లో జిల్లా వ్యాప్తంగా 34,314 మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. కార్యక్రమంలో జేసీ చేతన్‌, ఆర్డీవో భాగ్యరేఖ, ఏఎస్పీ రామకృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరం కేజీబీవీ విద్యార్థినుల నృత్యం

చూడ చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి

పరేడ్‌ మైదానంలో విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని ధర్మవరం కేజీబీవీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థులు, ధర్మవరం లలితకళానికేతన్‌ బృందం నిర్వహించిన సంప్రదాయ, జానపద నృత్యాలు ఆహుతులను మంత్ర ముగ్దులను చేశాయి. స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత పోరాటాలు,   దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుక్కపట్నం డైట్‌ కళాశాల బాలికలు నిర్వహించిన ‘చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నాపల్లె పాలవెల్లి’ జానపద గీతానికి విద్యార్థులు చేసిన నృత్యృం మైమరపించింది. చిన్నారులు వందేమాతర గీతం అందరి హృదయాల్లో దేశ భక్తిని నింపింది. డైట్‌ విద్యార్థులను కలెక్టర్‌ ప్రశంశించారు. డీఈవో మీనాక్షి, ఎంఈలు వెంకటరమణనాయక్‌, గోపాల్‌నాయక్‌ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

చిన్నారి నృత్యాభినయం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు