logo

ఇంటికి చేరుకునేలోగా అనంతలోకాలకు..

పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లి.. మరో 2 కి.మీటర్ల దూరంలో ఇంటికి చేరుతున్న సమయంలో వెనుక వచ్చిన వాహనం ఢీనటంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.

Published : 27 Jan 2023 04:33 IST

వాహనం ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లి.. మరో 2 కి.మీటర్ల దూరంలో ఇంటికి చేరుతున్న సమయంలో వెనుక వచ్చిన వాహనం ఢీనటంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. సోమందేపల్లి గీతానగర్‌కు చెందిన గూడూరు రమేష్‌ పట్టు చీరల వ్యాపారి. ఆయనకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు శ్రీసాయినేత (25) అనంతపురంలో ఎం.ఫార్మసీ చదువుతున్నాడు. సోమందేపల్లి దుర్గానగర్‌కు చెందిన అతని స్నేహితుడు తరుణ్‌ (25) ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ధర్మవరంలో పట్టుచీరలు ఇచ్చే పనిమీద గురువారం శ్రీసాయినేత ద్విచక్రవాహనంపై వెళుతూ.. తరుణ్‌ను వెంట తీసుకెళ్లాడు. వీరి అక్కడ పని ముగించుకొని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై వస్తుండగా.. వెంకటాపురం తండా సమీపంలో జాతీయ రహదారిపై వెనుకనుంచి వచ్చిన ఐషర్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీసాయినేతను హిందూపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తరుణ్‌ తండ్రి కుళ్లాయప్ప గతేడాది అనారోగ్యంతో మృతిచెందారు. తల్లి అంజినమ్మ, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పెనుకొండ ఎస్సై రమేష్‌బాబు వివరించారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందటానికి శిరస్త్రాణం ధరించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు