logo

ప్రత్యేక కేటాయింపుల్లేవ్‌...!

కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఏవీ చూపలేదు.

Published : 02 Feb 2023 05:24 IST

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి అనంత జిల్లాకు నిరాశే

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఏవీ చూపలేదు. కొన్నిరంగాల్లో ఉమ్మడిగా కలిసొస్తున్నప్పటికీ కేంద్ర సంస్థలకు నిధుల కేటాయింపులో నిరాశే మిగిలింది. కరవు ప్రాంతమైన ఉమ్మడి అనంతరం జిల్లాకు ప్రత్యేక నిధుల ప్రస్తావనే లేదు. ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, నాసిన్‌లకు నిధుల ఊసే లేదు. బెంగళూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి నిధులపై స్పష్టత లేదు. ఆదాయ పన్ను పరిమితి రూ.7 లక్షలకు పెంచడం కొంత ఊరటనిచ్చినప్పటికీ.. ఉపాధిహామీ పథకానికి నిధుల కోత కలవర పెడుతోంది. వ్యవసాయ రంగానికి ప్రోత్సహకాలు ప్రకటించడం అనంతకు కలిసొచ్చే అంశం.


కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.47.40 కోట్లే

కేంద్రీయ విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర పునర్విభజన అనంతరం కేంద్రప్రభుత్వం అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఏడేళ్లుగా అరకొర నిధులతో అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర బడ్జెట్‌లో గత సంవత్సరం కంటే తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. గత సంవత్సరం సాధారణ పరిపాలన, వేతనాల కోసం రూ.56 కోట్లు కేటాయించారు. ఈసారి కేవలం రూ.47.40 కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరం కంటే రూ.9 కోట్లు తక్కువ. భవనాలకు గతంలోనే నిధులు మంజూరైనా ఇప్పటి వరకూ పనులు చేపట్టలేదు. ఇటీవల భవనాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అయితే భవనాలకు ప్రస్తుత బడ్జెట్‌కు సంబంధం లేదు. కేవలం విశ్వవిద్యాలయం నిర్వహణకు మాత్రమే ఈ నిధులు కేటాయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న బోధన సిబ్బంది అంతా అతిథి అధ్యాపకులే. తరగతులు, వసతి గృహాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అవసరమైనంత మేరకు నిధులు రాకపోవపోవడంతో కేంద్రీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.


వసతుల కల్పనకు అవకాశం

రైళ్లలో సదుపాయాలు పెంచేందుకు కేటాయింపులు చేశారు. రైల్వేస్టేషన్లలోనూ మౌలిక వసతులు మెరుగుపరచనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే గుంతకల్లు స్టేషన్‌ను తీర్చిదిద్దారు. తాజా కేటాయింపులతో జిల్లాలోని మరిన్ని రైల్వేస్టేషన్ల సుందరీకరణ జరిగే అవకాశం ఉంది. ధర్మవరం-పాకాల డబుల్‌లైన్‌ నిర్మించడానికి గతంలో రూ.200 కోట్లు కేటాయించి తర్వాత మళ్లించారు. పాకాల నుంచి కాట్పాడి డబుల్‌లైన్‌ అమలుకు నోచుకోవడం లేదు. తిరుపతి-పాకాల, ఎర్రగుంట్ల-నంద్యాల, గుత్తి-పెండేకల్లు మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు జరగాల్సి ఉంది. రాయచోటి-కదిరి-హిందూపురం, ధర్మవరం-కళ్యాణదుర్గం-బళ్లారి, ముద్దనూరు-ముదిగుబ్బ మార్గాల్లో కొత్త లైన్లకు సర్వే చేసి గతేడాది నివేదించారు. అయితే ఇంకా కేటాయింపులపై స్పష్టత రాలేదు.


‘ఉపాధి’ తగ్గనుంది

కరవు, వలసల నేపథ్యంలో అనంతపురం జిల్లాకు ఉపాధి హామీ పథకం ఎంతో ప్రయోజనకరం. అయితే రెండేళ్లుగా ఉపాధిహామీ పథకానికి నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. జిల్లాలో 2022-23 93 లక్షల పనిదినాలు కల్పించి రూ.195 కోట్లు వేతనాల రూపంలో చెల్లించారు. రూ.163 కోట్లు మెటిరీయల్‌ కాంపొనెంట్‌ కింద ఖర్చు చేశారు. ఇంకో రూ.100 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. 2021-22లో మొత్తం 2.42 కోట్ల పనిదినాలు కల్పించి రూ.549 కోట్లు వేతనాల రూపంలో చెల్లించారు. మెటిరీయల్‌ కాంపోనెంట్‌ కింద రూ.200 కోట్లు ఖర్చు చేశారు. నిధులు తగ్గించిన నేపథ్యంలో ఉపాధి కూలీలు నష్టపోయే ప్రమాదం ఉంది.


మరిన్ని ఇళ్లు..

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణాలు, గ్రామాల్లో నిర్మించే ఇళ్ల సంఖ్యను కేంద్రం భారీగా పెంచింది. దీంతో మరింత మందికి పక్కా ఇళ్లు అందనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పీఎంఏవై కింద 1.11 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 79 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇంటి నిర్మాణం కోసం కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర సాయం కూడా పెంచాలనే డిమాండు వినిపిస్తోంది.


సేంద్రియం వైపు..

వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో రూ.13 లక్షల కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో 10 లక్షల మంది రైతుల వరకు ప్రయోజనం కలగనుంది. దీంతోపాటు రైతుల ఉత్పత్తులను నిల్వ చేయడం కోసం భారీగా గిడ్డంగుల నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో కోటిమంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో సేంద్రియ విస్తీర్ణం: 78,000 ఎకరాలు
సాగు రైతులు: 56 వేల మంది


చిరుధాన్యాలకు సాయం

2023ను చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్రం ప్రకటించింది. మార్కెటింగ్‌ సదుపాయాలు మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బోర్ల కింద వరికి బదులుగా తృణ ధాన్యాలు పండించాలని సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రోత్సహకాలు రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. దీంతోపాటు ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచడం కోసం రూ.2,200 కోట్ల మేర ప్రోత్సాహకాలు ప్రకటించారు. జిల్లాలో సుమారు 5.1 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. యువ రైతులను ప్రోత్సహించడం కోసం అంకుర సంస్థలకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు.
తృణధాన్యాల పంట విస్తీర్ణం: 36,000 ఎకరాలు
ఉమ్మడి జిల్లాలో సాగుచేసే రైతులు: 8 వేలు


చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు

అరవిందనగర్‌ (అనంతపురం): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు క్రెడిట్‌ గ్యారంటీ స్కీం పరిధి పెంచుతూ బడ్జెట్లో నిధుల కేటాయింపు అభిలషణీయం. చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యమినివ్వడం, రాయలసీమ జిల్లానేలలు సాగుకు అనుకూలంగా ఉండటం రైతాంగానికి ఊరట కలుగనుంది. జిల్లా రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఆదాయపన్ను పరిమితి పెంపు వ్యాపార వర్గాలకు కొంత ప్రయోజనం కలుగుతుంది.

శేషాంజనేయులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు


డిజిటల్‌ గ్రంథాలయాలు

విద్యార్థులకు డిజిటల్‌ గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డులు యూనిట్‌గా డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నారు. గత బడ్జెట్‌లో డిజిటల్‌ తరగతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించారు. అయితే విద్యుత్తు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం, ఉపాధ్యాయుల అవగాహనలేమి కారణంగా చాలాచోట్ల వినియోగించడం లేదు. ఇప్పుడు డిజిటల్‌ లైబ్రరీలనైనా పక్కాగా అమలు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం.
ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు: 3,841
డిజిటల్‌ తరగతులు: 321
వర్చువల్‌ తరగతులు: 428


వేతన జీవులకు..

జిల్లా సచివాలయం: కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పొందు పరిచిన ఆదాయ పన్ను శ్లాబులపై ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. శ్లాబుల నిర్ణయం, పన్ను విధింపుపై ఏటా కేంద్రం నిరాశ కలిగిస్తోందంటూ సింహభాగం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం గతంతో పోల్చితే ప్రస్తుతం స్వల్ప ఊరట కలిగించినట్లేనని వెల్లడించారు. ఉమ్మడి అనంత జిల్లావ్యాప్తంగా సుమారు 1.37 లక్షల మంది వేతన జీవులున్నారు. ఆప్కాస్‌, నాలుగో తరగతి, ఒప్పంద ఉద్యోగులకు పెద్దగా ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోవచ్చు. అత్యధిక శాతం ఉద్యోగులు ఐటీ పరిధిలోకి వస్తున్నారు. రూ.7 లక్షల దాకా మినహాయింపులతో కూడిన పన్ను ఉంటుందని ప్రభుత్వం వెల్లడించడంతో కొంత ఊరట లభించింది.


స్వల్ప ఊరట

బడ్జెట్‌లో ఆదాయ పన్ను శ్లాబుల విషయంలో ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. గతంతో పోల్చితే స్వల్ప ఊరట కలుగుతుందంతే. సున్నా శాతం శ్లాబును కనీసం రూ.5 లక్షల దాకా పరిమితి పెంచి ఉంటే బాగుండేది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతోనే స్వల్పంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచినట్లు తెలుస్తోంది.

ఆర్‌ఎన్‌ దివాకర్‌రావు, జిల్లా ఛైర్మన్‌, ఏపీ జేఏసీ అమరావతి


ఉపయోగం లేదు..

ఆదాయ పన్ను శ్లాబులు అటుఇటు మార్పులు చేసినా ఏం ప్రయోజనం లేదు. ఏటా ఇదే తరహాలో కొనసాగిస్తోంది. డాక్టర్‌ ఓపీ ఫీజు రూ.20 ఉన్నపుడు శ్లాబులే... ఇప్పుడూ ఉన్నాయి. డాక్టర్‌ ఓపీ ఫీజు రూ.300 నుంచి రూ.500 దాకా ఉంది. నిత్యావసర ధరలు, ఇతరత్రా రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐటీ రేట్లు మాత్రం అక్కడే ఉన్నాయి. నేను ఏటా రెండు మాసాల జీతం ఐటీకే చెల్లిస్తున్నా.

ఎం.జయరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం


ఫర్వాలేదు

గతంతో పోల్చితే కొంతమేర ఫర్వాలేదు. శ్లాబులు ఏడు నుంచి ఆరుకు తగ్గించారు. సున్నా పన్ను చెల్లింపు శ్లాబును రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం స్వల్ప ఊరటే కదా. మినహాయింపులు పరిమితిని రూ.7లక్షలకు పెంచడం సంతోషమే. 

డి.చంద్రమోహన్‌, జిల్లా కార్యదర్శి, ఏపీ ఎన్జీఓ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని