logo

భూ మాఫియాదే రాజ్యం

‘రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి భూతద్దం వేసి వెతికినా కానరాలేదు.

Published : 02 Feb 2023 05:24 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజం
కలెక్టరేట్‌ ఎదుట 30 గంటల సత్యాగ్రహ దీక్ష

సంఘీభావం తెలుపుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నేతలు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి భూతద్దం వేసి వెతికినా కానరాలేదు. ఇప్పుడు భూ మాఫియాదే రాజ్యం. ఎక్కడ చూసినా భూ కబ్జాలే నడుస్తున్నాయి. ప్రభుత్వ భూములే కాదు... పేదల భూములు సైతం దౌర్జన్యంగా, అక్రమంగా లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. జగన్‌ సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ఇళ్లు, ఇళ్లపట్టాల సాధన కోసం ‘30 గంటలు సత్యాగ్రహం’ దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దలు, పేదల మధ్య పోరు సాగుతోందని సీఎం అంటున్నారు. ఇదే నిజమైతే రాష్ట్రంలో పేదలకు ఎందుకు ఇళ్లు కట్టించలేదు. ఇంటి పట్టాలు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ఈ ఒక్క జిల్లాలోనే అదాని వంటి పెద్దలకు 42వేల ఎకరాల భూమిని కట్టబెట్టారు. పేదలకు 42 గజాల స్థలం ఇవ్వలేరా అని నిలదీశారు. వైకాపా నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములన్నీ ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. పేదల భూములను సైతం దౌర్జన్యంగా లాక్కుంటున్నారని విమర్శించారు. సమస్యల కోసం ఉద్యమిస్తే వలంటీర్లు సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారు. ఈ వ్యవస్థ పేదలను పీడిస్తోందని ధ్వజమెత్తారు. అదాని కోసమే భాజపా సర్కార్‌ పని చేస్తోందని ఆరోపించారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండు చేశారు. దీక్షా శిబిరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, నాగేంద్రకుమార్‌, బాలరంగయ్య, సావిత్రి, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మధ్యాహ్నం అక్కడే వంటా వార్పు నిర్వహించారు. సీపీఎం కీలక నేతలందరూ నడిరోడ్డుపై భోజనం చేశారు. బుధవారం రాత్రి దీక్షా శిబిరంలోనే నిద్రించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని