logo

ఈ నెలా అంతే!

నెల రోజులపాటు అహర్నిశలు శ్రమించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తేదీ ‘జీతం’ వచ్చేది పగటి కలగా మారింది.

Published : 02 Feb 2023 05:24 IST

ఒకటో తేదీ జీతం రాలేదు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: నెల రోజులపాటు అహర్నిశలు శ్రమించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తేదీ ‘జీతం’ వచ్చేది పగటి కలగా మారింది. జనవరి జీతం ప్రస్తుత ఫిబ్రవరి ఒకటో తేదీ పడతాయన్న నమ్మకం, ఆశలు వేతన జీవుల్లో పూర్తిగా సన్నగిల్లాయి. ఎప్పటిలాగే ఈ నెల కూడా ఒకటో తేదీ జీతం పడనట్లేనని తేలిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైన సంగతి తెలిసిందే. పీఎఫ్‌, సరెండర్‌ సెలవు, ఏపీజీఎల్‌ఐ, పదవీ విరమణ... వంటి ఆర్థిక ప్రయోజనాలు సంగతి దేవుడెరుగు... ప్రతి నెలా జీతం ఇస్తే చాలన్న దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. గడిచిన ఆరు నెలలుగా ఉద్యోగుల జీతాలపై ప్రతి నెలా ఉత్కంఠ, ఆందోళన తలెత్తుతోంది. ఈసారైనా ఒకటో తేదీ జీతం వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఒకటో తేదీ జీతం... అన్న విషయాన్ని మున్ముందు మరిచిపోయేలా జగన్‌ సర్కార్‌ వ్యవరిస్తోందంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పెదవి విరిచాయి. తెలుగుజాతికి కీలకమైన సంక్రాంతి పండగ నాటికి కూడా గత నెలలో వేతనాలు పూర్తిస్థాయిలో పడలేదు. ఇరవై తేదీ దాకా జీతాలు జమ చేశారు.


అప్పుపైనే ఆధారం

ఉమ్మడి అనంత జిల్లాలో నిర్దేశిత ఉప ఖజానా కార్యాలయాల(ఎస్టీఓ) నుంచి డీడీఓలు సమర్పించిన బిల్లులను అప్‌లోడ్‌ చేశారు. నిర్దేశిత గడువులోపే ప్రభుత్వానికి నివేదించారు. తప్పకుండా ఫిబ్రవరి ఒకటో తేదీ జీతం వస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడిచింది. ‘షరా మామూలే’ అన్న విధంగా ఒకటిన జీతం పడలేదు. పోలీసు శాఖలో సివిల్‌, రెవెన్యూ శాఖలో కొందరికి మాత్రమే వేతనం పడినట్లు తెలుస్తోంది. 90 శాతం మందికిపైగా జీతం అయితే జమ కానట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులు, పెన్షనర్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. తమ పట్ల ప్రభుత్వం పూర్తిగా వివక్షత చూపిస్తోందంటూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అప్పుపైనే జీతాలు ఆధారపడ్డాయి. అప్పు ఎవరు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారోనన్న సందిగ్ధం నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.37 లక్షల మంది ఉద్యోగులు వేతనం కోసం ఎదురుచూస్తున్నారు. ఐదో తేదీలోపైనా ఇస్తే చాలన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని