logo

ఆటో నడుపుతూ.. ఆసరాగా ఉంటూ..

అమ్మానాన్నలిద్దరూ మృతిచెందారు. అన్నతమ్ముళ్లు కూలీ పనులు చేయగా వచ్చే చాలీచాలని సంపాదనతో జీవనం సాగించేవారు.

Updated : 02 Feb 2023 05:58 IST

ఆటో నడుపుతున్న ఖైరున్‌బీ

తాడిపత్రి, న్యూస్‌టుడే:  అమ్మానాన్నలిద్దరూ మృతిచెందారు. అన్నతమ్ముళ్లు కూలీ పనులు చేయగా వచ్చే చాలీచాలని సంపాదనతో జీవనం సాగించేవారు. పోషణ కష్టతరంగా మారడంతో ఆమె కష్టపడి ఆటో నేర్చుకున్నారు. రోజూ ఆటో నడపగా వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్న తాడిపత్రికి చెందిన ఖైరున్‌బీ గురించి స్ఫూర్తిదాయక కథనం.

తాడిపత్రి పట్టణంలోని మెయిన్‌బజార్‌ పాత ఆంధ్రాబ్యాంకు వెనకాల వీధికి చెందిన బాషు, గౌసియాబీలకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. వారిలో ఖైరున్‌బీ మూడో సంతానం. 14 ఏళ్ల కిందట నాన్న, ఆరు నెలల క్రితం అమ్మ మృతిచెందారు. అన్న, తమ్ముళ్లు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఖైరున్‌బీ ఆటో నేర్చుకున్నారు. లైసెన్సు పొంది రోజూ ఆటో నడుపుతూ వచ్చిన సంపాదనతో చెల్లెళ్లు, తమ్ముళ్లకు అండగా నిలిచారు. 8 నెలల కిందట ఒక చెల్లెలికి పెళ్లి చేశారు. మరో చెల్లెలిని పదోతరగతి వరకు చదివించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు పాఠశాలలో ఉర్దూ టీచర్‌గా పని చేస్తోంది.


ముగ్గురు ఆడపిల్లల ఆలనాపాలనా చూస్తూ..

ఖైరున్‌బీ తమ్ముడి భార్య కొన్ని నెలల కిందట మృతి చెందారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం వారి ఆలనాపాలనను ఖైరున్‌బీ చూస్తున్నారు. రోజూ ఉదయాన్నే ఇద్దరు చిన్నారులను రెడీ చేసి పాఠశాలకు వదిలిపెట్టి వస్తారు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో మరో చిన్నారిని తన వెంట ఆటోలో తీసుకెళ్తున్నారు. ఆటో నడుపుతూ రోజూ రూ.500 సంపాదిస్తున్నట్లు చెప్పారు. గతంలో రూ.1000 వరకు వచ్చేవని, ప్రస్తుతం చిన్నారుల బాగోగులు చూసుకోడానికి సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని