logo

వైకాపాలో విభేదాలతో శుద్ధజల కేంద్రం మూత

కనగానపల్లి మండలంలోని కేఎన్‌పాళ్యం గ్రామంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్త మధ్య విభేదాల కారణంగా శుద్ధజల కేంద్రం మూతపడింది.

Published : 02 Feb 2023 05:24 IST

కేఎన్‌పాళ్యం(కనగానపల్లి), న్యూస్‌టుడే: కనగానపల్లి మండలంలోని కేఎన్‌పాళ్యం గ్రామంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్త మధ్య విభేదాల కారణంగా శుద్ధజల కేంద్రం మూతపడింది. దీంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.3కు బిందె నీటిని అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కేంద్రం నిర్వహణ బాధ్యతలను ఆ పార్టీ కార్యకర్త ఒకరు చూస్తున్నారు. అతడు ఇల్లు నిర్మించుకోవాలని భావించి ముఖ్య నాయకుల వద్దకు వెళ్లాడు. గ్రామంలో అధికార పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా ఉండటం వల్ల ఒకరు అతనికి ఇల్లు మంజూరు చేయాలని, మరొక గ్రూపు నాయకులు ఇవ్వకూడదని చెప్పడంతో కార్యకర్త 20 రోజుల కిందట కేంద్రానికి తాళం వేసి తాళం చెవులను నాయకులకు ఇచ్చి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కేంద్రం తెరుచుకోలేదు. గ్రామస్థులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగిరి మండలంలోని పేరూరు గ్రామానికి వెళ్లి శుద్ధజలం తెచ్చుకుంటున్నారు. మరికొందరు పెన్నానది సమీపంలోని చెలిమల నీటిని తెచ్చుకొని తాగుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని శుద్ధజల కేంద్రాన్ని తెరిపించి, తాగునీరు అందేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని