logo

భూకబ్జాను విన్నవిస్తే చరవాణులు లాక్కున్నారు

భూములు కబ్జాకు గురవుతున్నాయని విన్నవించడానికి వెళితే చరవాణులు లాక్కున్నారని దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2023 06:09 IST

కబ్జాకు గురయ్యాయని విన్నవిస్తున్న స్థానికులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: భూములు కబ్జాకు గురవుతున్నాయని విన్నవించడానికి వెళితే చరవాణులు లాక్కున్నారని దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మనహాళ్‌ మండలం కొలగానహళ్లిలో గురువారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని సర్వే నం.102ఏలో మిగులు భూమి ఉన్నా నిరుపేద దళితులకు ఇవ్వకుండా వైకాపా నాయకులు ఆక్రమిస్తున్నారని హనుమంతు, వండ్రప్ప, సుంకమ్మ, శిద్దమ్మ, హనుమక్క, ప్రభాకర్‌ తదితరులు తెలిపారు. వాళ్లంతా తెదేపాకు చెందినవారని అక్కడే ఉన్న వైకాపా నాయకులు చెప్పడంతో ప్రభుత్వవిప్‌ మండిపడ్డారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల వద్దకు వెళ్లండి.. ఆయనే భూములిస్తారని చెప్పి దాటేశారు. ఈ విషయాన్ని చరవాణిలో ఇద్దరు యువకులు చిత్రీకరిస్తుండగా పోలీసులు లాక్కున్నారు. గ్రామంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత 11 గంటల సమయంలో చరవాణులు తిరిగి అందించారు. తమ వద్ద వినతిపత్రం కూడా తీసుకోలేదని, తర్వాత వైకాపా నాయకులు తీసుకుని గ్రామ సమీపంలోని చెట్లవద్ద పడేసి వెళ్లారని ప్రభాకర్‌ తెలిపారు. పోలీసు బందోబస్తు నడుమ గడపగడపకు మన ప్రభుత్వం పూర్తి చేసుకుని వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు