logo

భోజనం పెట్టాలంటే అప్పు చేయాల్సిందే.!

మెస్‌ బిల్లులు రాక వసతి గృహాల సంక్షేమ అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా నెలల తరబడి బిల్లులు రాక పడరాని పాట్లు పడాల్సివస్తోంది.

Published : 03 Feb 2023 06:09 IST

గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో దుస్థితి

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: మెస్‌ బిల్లులు రాక వసతి గృహాల సంక్షేమ అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా నెలల తరబడి బిల్లులు రాక పడరాని పాట్లు పడాల్సివస్తోంది. ఇతర శాఖల్లోని వసతిగృహాలకు కొంత వరకు బిల్లులు వస్తున్నా గిరిజన సంక్షేమ వార్డెన్ల పరిస్థితి దారుణంగా మారింది. ఓ అధికారి నిర్లక్ష్యం.. వారి పాలిట శాపంగా మారింది. ఏడు నెలలుగా ఇదే తీరు నెలకొంది. జిల్లాల విభజన సందర్భంగా చేసిన తప్పిదం ఇప్పటి దాకా వెంటాడుతూనే ఉంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని గిరిజన సంక్షేమ వసతిగృహాలకు బడ్జెట్‌ లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇంతకుముందు గిరిజన సంక్షేమ వసతిగృహాలకు పెనుకొండ సహాయ సంక్షేమ అధికారి పరిధి ద్వారా బిల్లులు మంజూరు అయ్యేవి. జిల్లా విభజన తరువాత అక్కడి సహాయ సంక్షేమ శాఖ కార్యాలయం పుట్టపర్తికి మారింది. మరో ప్రాంతంలో డీడీఓ (డ్రాయింగ్‌ డిస్పర్సింగ్‌ ఆఫీసర్‌ )కోడ్‌ వస్తుందని అక్కడ ఉన్న అధికారి థంబ్‌ లేకుండా నిష్క్రమించారు. బడ్జెట్‌ను సైతం సరెండరు చేయడంతో విద్యార్థులకు అందాల్సిన నిధులు వెనక్కిపోయాయి. ఏకంగా రూ.81 లక్షలు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్ల్లా పరిధిలోని 20 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వాటి పరిధిలో 3వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇటీవలే అరకొరగా మూడు, నాలుగు విడతల్లో నిధులు వచ్చాయి. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు బిల్లులు రావాల్సి ఉంది. వార్డెన్లు అప్పులు చేసి తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోతున్నారు.

ఇతర సంక్షేమ గృహాల్లోనూ అంతంతే..

బీసీ, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని ప్రాంతాలకు బడ్జెట్‌ తక్కువగా విడుదల చేస్తున్నారు. శ్రీసత్యసాయి, గుత్తి డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేసి డీడీఓ కోడ్‌ రాకపోవడంతో బిల్లులు రావడం లేదు. అనంతపురం డివిజన్‌ పరిధిలో కళాశాల వసతి గృహాలకు నాలుగు నెలలుగా మెస్‌ బిల్లులు రాకపోవడంతో వార్డెన్లుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రీమెట్రిక్‌ వసతిగృహాలకు రెండు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో మొత్తం
​​​​​​​వసతిగృహాలు: 215
విద్యార్థులు: 23,041


త్వరలోనే వస్తాయి..
- అన్నాదొర, గిరిజన సంక్షేమ అధికారి

జిల్లా విభజనతో  బిల్లులు సమస్య ఉన్నది వాస్తవమే. కొంత వరకు మంజూరు అయ్యాయి. జులై వరకు వచ్చాయి. మిగిలినవి తొందరలోనే వస్తాయి. కొంత జాప్యం అయినా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు