logo

వైకాపా నుంచి యాదవ సంఘం నాయకుడి సస్పెన్షన్‌

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న నెపంతో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి మాజీ సర్పంచి, అఖిల భారత యాదవ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్పను వైకాపా నుంచి సస్పెండ్‌ చేశారు.

Published : 03 Feb 2023 06:09 IST

లక్ష్మీనరసప్ప

గోరంట్ల, న్యూస్‌టుడే: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న నెపంతో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి మాజీ సర్పంచి, అఖిల భారత యాదవ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్పను వైకాపా నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ చర్యలు తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రయాదవ్‌ మధ్య విభేదాల నేపథ్యంలో.. రామచంద్రయాదవ్‌ ఆస్తులను గతంలో వైకాపా వారు ధ్వంసం చేశారు. ఈ చర్యను ఖండిస్తూ లక్ష్మీనరసప్ప నాటి సమావేశంలో ఘాటుగా విమర్శించారు. రామచంద్రయాదవ్‌ ఇటీవల జిల్లాలో తన సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకుల ఇళ్లకు వచ్చారు. ఆ సమయంలో లక్ష్మీనరసప్ప కూడా పాల్గొన్నారు.

‘బీసీలపై దాడిగా పరిగణిస్తాం’

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: గోరంట్ల మండలం వెంకటరమణపల్లికి చెందిన లక్ష్మినరసప్పను వైకాపా నుంచి సస్పెండ్‌ చేయడం బీసీలపై చేస్తున్న దాడిగా పరిగణిస్తామని బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములుయాదవ్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన పెనుకొండలో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే శంకరనారాయణ కొమ్ముకాస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన పార్టీకి ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేశారో తెలియజేయకుండా తొలగించిన తీరు హాస్యాస్పదమన్నారు. శంకరనారాయణ బీసీల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి పెద్దిరెడ్డికి ఎందుకు తొత్తుగా మారుతున్నావని ప్రశ్నించారు. బీసీలు మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని