logo

భూసారం.. పలితం నిస్సారం!

భూసార పరీక్ష కేంద్రం ఉమ్మడి జిల్లాకే తలమానికం. కొన్నేళ్లుగా భూసార పరీక్షలు, కార్డులు సక్రమంగా అందించారు. గత ప్రభుత్వ హయాంలో మట్టి నమూనాలు గుట్టలు గుట్టలుగా వచ్చేవి.

Published : 03 Feb 2023 06:13 IST

మూడేళ్లుగా ప్రణాళికలే తప్ప..ప్రయోజనం శూన్యం
న్యూస్‌టుడే, జిల్లా వ్యవసాయం

భూసార పరీక్ష కేంద్రం ఉమ్మడి జిల్లాకే తలమానికం. కొన్నేళ్లుగా భూసార పరీక్షలు, కార్డులు సక్రమంగా అందించారు. గత ప్రభుత్వ హయాంలో మట్టి నమూనాలు గుట్టలు గుట్టలుగా వచ్చేవి. అంత ప్రాధాన్యం ఉన్న కేంద్రాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్జీవం చేసింది. గత మూడేళ్లలో నిధులు ఇవ్వలేదు. పరీక్షలకు కావాల్సిన రసాయనాలు లేవు. ఒక్క పరీక్ష కూడా చేయలేదు. ఉన్న సిబ్బందిని రెండేళ్ల కిందట వ్యవసాయశాఖ ఇతర చోట్లకు డెప్యుటేషన్‌పై పంపారు. ఇటీవల సిబ్బందిని మళ్లీ నియమించారు. రసాయనాలు సరఫరా చేయలేదు. చేసేది లేక సిబ్బంది అరకొరగా మట్టి పరీక్షలు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తులకు భూసార ఫలితాలు ఆధారంగా చేసే సాగే శ్రేయస్కరం అన్నది వ్యవసాయ శాస్త్రవేత్తల మాట. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోంది. గత మూడేళ్లుగా ప్రణాళికలు బాగున్నా.. కాగితాలకే పరిమితమవుతున్నాయి.


లక్ష్యం ఘనం.. సేకరణ ఏదీ..

రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఏటా లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆచరణలో లేదు. మూడేళ్లుగా ఒక్క పైసా ఇవ్వలేదు.. పరీక్ష చేసిందేలేదు. కొంత మంది రైతులు మాత్రమే నేల స్వభావాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. జాతీయ సుస్థిర వ్యవసాయ ప్రాజెక్టు(ఎన్‌ఎంఎస్‌ఏ) కింద 2015-19 వరకు 40,786 మట్టి నమూనాలు తీసి పరీక్షలు చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రైతులకు కార్డులు జారీ చేశారు. 2019-20, 2023-24 వరకు భూసార పరీక్షల లక్ష్యాలు నిర్ణయించారు. కాని ఒక్కటీ చేయకపోవడం గమనార్హం.

నిరుపయోగంగా వాహనం


సంచార వాహనం.. అలంకారప్రాయం

అన్నదాతలకు పొలం వద్దకే భూసార పరీక్ష ఫలితాలు తెలపాలనే సంకల్పంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకు ఒకటి చొప్పున సంచార పరీక్ష వాహనాన్ని కేటాయించింది. ప్రత్యేకంగా నలుగురు సిబ్బందిని నియమించారు. భారీగా మట్టి నమూనాలు వచ్చేవి. వెనకబడిన వ్యవసాయ సబ్‌ డివిజన్లకు వాహనాన్ని పంపించి పరీక్షలు చేసి, ఫలితాలు అందజేసేవారు. ఈక్రమంలో నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వలేదు. మూడేళ్ల నుంచి జిల్లా పరీక్షా కేంద్రం వద్దే అలంకారప్రాయంగా ఉంది. మట్టి నమూనా ఫలితాలు పొలం వద్దకే వస్తాయనుకున్న అన్నదాతల ఆశలను నీరుగార్చారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే సంచార భూసార పరీక్ష వాహనాన్ని వినియోగంలోకి తెచ్చి రైతులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  


పరీక్షలు చేస్తున్నాం..
- రోజాపుష్పలత, సహాయ సంచాలకులు (భూసార పరీక్ష కేంద్రం)

కొన్ని రోజులుగా మట్టి నమూనాలు తీసుకొచ్చే రైతులకు పరీక్షలు చేసి, ఫలితాలు అందజేస్తున్నాం. నిత్యం 90-95 పరీక్షలు చేస్తున్నాం. రబీ సీజన్‌ పూర్తి కాగానే మట్టి నమూనాలు సేకరిస్తాం. జిల్లాలో 455 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో ఆర్‌బీకే నుంచి 22 చొప్పున మట్టి నమూనాలు సేకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నమూనాలను జిల్లా పరీక్షా కేంద్రానికి పంపితే పరీక్షలు చేసి ఫలితాలను ఆర్‌బీకేలకు పంపి, రైతులకు అందజేస్తాం. వచ్చే ఖరీఫ్‌ నుంచి మట్టి పరీక్షలు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు