logo

రెవెన్యూపై రాజకీయ పెత్తనం

జిల్లాలో ‘రెవెన్యూ’ శాఖపై రాజకీయ ఒత్తిళ్లు తారాస్థాయికి చేరాయి. చాలా చోట్లా కీలక ప్రజాప్రతినిధులే పెత్తనం చెలాయి స్తున్నారు.

Published : 04 Feb 2023 04:00 IST

సెలవుపై తహసీల్దార్లు..
ఇన్‌ఛార్జి పాలనలో మండలాలు


అనంత రెవెన్యూ డివిజన్‌లోని ఓ మండల తహసీల్దారు రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పేరుతో సెలవుపై వెళ్లారు. కబ్జా భూములు, మ్యూటేషన్‌, ఎన్‌ఓసీ.. వంటి పనులు చేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడంతో విధిలేక వెళ్లినట్లు తెలుస్తోంది. ఉప తహసీల్దారే ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.


గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని ఓ మండలంలో ఆరు నెలలకుపైగా తహసీల్దారే లేరు. అక్కడికి వెళ్లి పని చేయడానికి చాలా మంది జంకుతున్నారు. అక్కడి రాజకీయాలతో భయపడే పరిస్థితి తలెత్తింది. ఎన్నికల విభాగం ఉప తహసీల్దారే ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.


న్యూస్‌టుడే: జిల్లా సచివాలయం: జిల్లాలో ‘రెవెన్యూ’ శాఖపై రాజకీయ ఒత్తిళ్లు తారాస్థాయికి చేరాయి. చాలా చోట్లా కీలక ప్రజాప్రతినిధులే పెత్తనం చెలాయి స్తున్నారు. తానే కాదు... తమ అనుచరులు చెప్పే పనులు చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. సక్రమమా.. అక్రమమా అన్న తేడా లేకుండా ఏమి చెబితే అది చేయాలి. లేదంటే... ఈ సీట్లో ఉండరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రెండుమూడు మాసాలుగా ఈ తరహా వ్యవహరం మరీ ఎక్కువైంది. ‘ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే పనులైతే చేస్తాం... అడ్డమైన పనులు చేస్తే తమ ఉద్యోగానికే ఎసరు వస్తుందన్న’ భయందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. వీఆర్‌ఓ, ఆర్‌ఐలే కాదు... తహసీల్దార్లు సైతం ఆందోళన, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. విధిలేక కొందరు అనారోగ్యం పేరుతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే ఇద్దరు తహసీల్దార్లు సెలవులో ఉన్నారు. మరో మూడు చోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నా ఎవ్వరూ వెళ్లడం లేదు.

మొన్నటి సాధారణ బదిలీల్లో కొందరు తహసీల్దార్లు అటుఇటు స్థానాలు మారారు. రాప్తాడు తహసీల్దారు అనారోగ్యం అంటూ నెల రోజులుగా సెలవులో ఉన్నారు. పెద్దవడుగూరుకు వెళ్లి సంవత్సరం కాకపోయినా రాప్తాడుకు పంపించారు. ఉప తహసీల్దారే బాధ్యులుగా ఉన్నారు. ఆత్మకూరులో మూడు మాసాలుగా ఇదే పరిస్థితి. ఆ మండలంలో భూ సమస్యలు ఎక్కువే. గుంతకల్లు పోస్టు ఖాళీ. ఇక్కడి వెళ్లడానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. గుంతకల్లు డివిజన్‌ కార్యాలయంలో డీఏఓ పోస్టు ఖాళీనే. కూడేరు తహసీల్దారుగా వెళ్లడానికి జంకుతున్నారు. ఇక్కడ భూ వ్యవహరాల్లో వివాదాలు తలెత్తాయి. రెగ్యులర్‌ తహసీల్దారు సస్పెండ్‌ అయ్యారు. అప్పటి నుంచి ఎవ్వరూ అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు.


చెప్పిన పని చేయకపోతే అంతే...

జిల్లాలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు పెచ్చుమీరాయి. ప్రభుత్వ స్థలాలే కాదు... పేదల భూములు సైతం లాగేసుకుంటున్నారు. మ్యుటేషన్‌, వెబ్‌ల్యాండ్‌లో ఎడాపెడా పేర్లు మార్చాలంటే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎస్సీ,ఎస్టీలకు ప్రభుత్వాలు ఇచ్చిన డి.పట్టా భూములను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఇప్పటికే జిల్లా స్థాయి స్పందనకు వచ్చాయి. చెప్పిన పనులు తప్పకుండా చేయాల్సిందే..లేదంటే బదిలీ ఖాయంగా మారింది. క్షేత్ర స్థాయిలో తలెత్తిన ఒత్తిళ్లును తట్టుకోలేక సెలవుపై వెళ్లడానికి చాలా మంది సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని