logo

నిధుల కొరతంటూ.. యాత్రకు సై అంటూ..!

‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న సామెత అనంతపురం నగరపాలక సంస్థకు సరిగ్గా సరిపోతుంది.

Published : 04 Feb 2023 04:00 IST

అనంత నగరపాలక తీరు

గ్లౌజులు, బూట్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం న్యూస్‌టుడే, నగరపాలక: ‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న సామెత అనంతపురం నగరపాలక సంస్థకు సరిగ్గా సరిపోతుంది. పారిశుద్ధ్య కార్మికులకు వస్తుసామగ్రి అందించలేని అధికారులు స్టడీ టూర్‌ పేరిట కార్పొరేటర్లను యాత్రకు తీసుకెళ్తున్నారు. చీపుర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో యాత్రకు రూ.33 లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మొత్తాన్ని సాధారణ నిధుల్ని వినియోగించాలని నిర్ణయించారు. ఇండోర్‌, దిల్లీ, ఆగ్రా నగర పాలకసంస్థల్లో ఘనవ్యర్థాల నిర్వహణ పరిశీలించేందుకు కార్పొరేటర్లను తీసుకెళ్తున్నట్లు చెబుతున్నట్లు. పాలకవర్గంతోపాటు అధికారులు కలిపి మొత్తం 64 మంది వెళ్లనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలికవసతుల కల్పనకు నిధులు కొరతని చెబుతూ వస్తున్న అధికారులు ‘స్టడీ టూర్‌’ పేరుతో పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది.


12 నుంచి 16 వరకు..

ఇండోర్‌, దిల్లీ, ఆగ్రా నగరాల్లో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు యాత్ర జరగనుంది. బెంగళూరు వెళ్లి.. విమానంలో అదే రోజు సాయంత్రం ఇండోర్‌ చేరుకుంటారు. అక్కడ ఫోర్‌స్టార్‌ హోటల్‌లో బస చేయనున్నారు. 14న దిల్లీ చేరుకుని అక్కడి నగరపాలక సంస్థను పరిశీలించనున్నారు. 15న ఆగ్రాలో పర్యటిస్తారు. 16న బెంగళూరుకు విమానంలో చేరుకుంటారు. 50 మంది కార్పొరేటర్లు, 5 మంది కోఅప్షన్‌ సభ్యులు, 9 మంది అధికారులు, సిబ్బంది యాత్రకు వెళ్లనున్నారు. ఒక్కొక్కరికీ రూ.52,777 ఖర్చు చేయనున్నారు.ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ టెండరు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగర జనాభా 3.31 లక్షలు. పది లక్షలలోపు జనాభా కలిగి ఉన్న వాటిలో తిరుపతి ఉంది. స్వచ్ఛత ర్యాంకుల్లో దేశంలోనే మొదటి స్థానం సంపాదించింది. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ తీరును పరిశీలించి సహకారం పొందవచ్చు. ఇలా చేస్తే నిధులు మిగిలి ఇతర వాటికి వినియోగించడానికి అవకాశాలు ఉంటాయి.


కేటాయింపు రూ.50 లక్షలే...

నగరంలో 450 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు 2021-22లో రూ.50 లక్షలు కేటాయించారు. తమకు అవసరమైన సామగ్రి అందించడం లేదని కార్మికులు ఇటీవల ధర్నా చేశారు. రెండేళ్లుగా భద్రతా పరికరాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. దీంతో కార్మిక సంఘాల నాయకులతో అధికారులు రెండు రోజుల కిందట సమావేశమై మార్చిలో పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా.. కార్పొరేటర్ల యాత్రకు రూ.33 లక్షలు సాధారణ నిధుల నుంచి ఖర్చు చేస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కార్మికులు చేతికి గ్లౌజులు, కాళ్లకు బూట్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేయాల్సి వస్తోంది. యాత్ర కోసం ఖర్చు చేసే నిధుల్ని నగరంలో దెబ్బతిన్న రహదారులను మరమతు  ఇతరత్రా కనీస అవసరాలకు వినియోగిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నగరవాసులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని