logo

జల్సా కోసం.. దొంగలుగా మారి

ద్విచక్ర వాహనాలను దొంగలించి, వాటికి నకిలీ రికార్డులు తయారు చేసి విక్రయించే యువ ముఠా ఆట కట్టించారు హిందూపురం పోలీసులు.

Published : 04 Feb 2023 04:00 IST

నిందితులను చూపుతున్న పోలీస్‌ అధికారులు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలను దొంగలించి, వాటికి నకిలీ రికార్డులు తయారు చేసి విక్రయించే యువ ముఠా ఆట కట్టించారు హిందూపురం పోలీసులు. డీఎస్పీ యశ్వంత్‌, పట్టణ సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం ఆ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన అసిఫ్‌, జబివుల్లాలు, మరో బాలుడు పరిగి రోడ్‌లోని వెల్డింగ్‌ దుకాణంలో పని చేసేవారు. వారు చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో వచ్చే సంపాదన సరిపోక ఇతర మార్గాలను అన్వేషించారు. వారికి రహమత్‌పురానికి చెందిన షేక్‌ జబివుల్లా, సత్తార్‌ఖాన్‌, నూర్‌ మహమ్మద్‌, అజీజ్‌ఖాన్‌, ముబారక్‌, మహబూబ్‌ భాషా, ఏజాజ్‌ జత కలిశారు. వారు వాహనాలను దొంగలిస్తే, వాటికి ఇంటర్‌నెట్‌ సెంటర్‌ నిర్వహించే అదిల్‌ఖాన్‌ నకిలీ పత్రాలను సృష్టించేవాడు. అసిఫ్‌, జబివుల్లా, మరో బాలుడు కలిసి హిందూపురం, మడకశిర, సోమందేపల్లి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో వాహనాలను దొంగలించారు. వాటిని ఓఎల్‌ఎక్స్‌లో విక్రయానికి పెట్టిన వాహనాల నెంబర్లు, వాటి యజమానుల వివరాలతో కూడిన రికార్డులను సృష్టించడం, దొంగలించిన వాహనాలకు ఆ నంబర్‌ ప్లేట్లను తగలించడం, బృందంలో మిగిలిన సభ్యులు వాటిని అమ్మడం చేశారు. వచ్చిన సొమ్మును సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న 36 వాహనాలకు రికార్డులు తయారు చేసి విక్రయించే విషయమై మాట్లాడుకోవడానికి సీపీఐ కాలనీలోని శివారు ప్రాంతానికి చేరుకొన్నా వారు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి వాహనాలతో పాటు నకిలీ రికార్డులను తయారు చేసే కంప్యూటర్‌, ప్రింటర్‌ స్వాధీనం చేసుకొన్నారు. బృందంలో మహబూబ్‌భాషా, ఏజాజ్‌ తప్పించుకొగా మిగిలిన 9 మంది పట్టుబడ్డారు. ఈ దొంగతనాల్లో 17 ఏళ్ల బాల నేరస్థుడు కీలక పాత్ర పోషించడం గమనార్హం. బృందంలోని వారంతా 30 ఏళ్లలోపే వయసు వారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని