logo

నిర్లక్ష్యం.. చేనేత కార్మికులకు శాపం

అధునాతన శిక్షణ, చీరలపై డిజైన్లు, నేత పనిలో మెలకువలు ఇచ్చేందుకు చేనేత-జౌళి శాఖ ఆధ్వర్యంలో హిందూపురంలో ఏర్పాటు చేసిన తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రం అలంకారప్రాయంగా మారింది.

Published : 05 Feb 2023 04:29 IST

అలంకారప్రాయంగా శిక్షణ కేంద్రం

నిరుపయోగంగా మగ్గాలు

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: అధునాతన శిక్షణ, చీరలపై డిజైన్లు, నేత పనిలో మెలకువలు ఇచ్చేందుకు చేనేత-జౌళి శాఖ ఆధ్వర్యంలో హిందూపురంలో ఏర్పాటు చేసిన తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బంది కొన్నేళ్లుగా కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు. విలువైన యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. పలు రకాలుగా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నా పట్టించుకొనే నాథుడు లేదు.

* చేనేత కార్మికుల బహుళ ప్రయోజనాలు ఆశించి 1987లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం, స్థానిక ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ హిందూపురంలో తొలుత గుడ్డం రంగనాథస్వామి దేవాలయం సమీపంలో 2.17 ఎకరాల విస్తీర్ణంలో తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్ర ఏర్పాటు చేశారు. తరవాత తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలోనూ మరో కేంద్రం ఏర్పాటైంది. చేనేత జౌళి శాఖ అధికారుల ద్వారా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున నేత కార్మికులను ఎంపిక చేసి వసతి కల్పించారు. వారికి రెండు నెలలు శిక్షణ భృతి రూ.1,200 అందించి పనిలో మెలకువలు, టవళ్లు, బెడ్‌షీట్లు, శిల్క్‌చీరలు, జాకాడ్‌ ద్వారా  చీరలు ఎలా అల్లాలో శిక్షణ ఇచ్చేవారు. దీని కోసం అప్పట్లో లక్షలు వెచ్చించి కేంద్రంలో వర్క్‌షెడ్‌, అద్దకపు విభాగం, తరగతి గది, వసతిగృహ సముదాయం, గ్రంథాలయం సౌకర్యం ఏర్పాటు చేశారు.

కనీస స్థాయిలో పని లేదు

ఈ కేంద్రంలో సహాయ సంచాలకులు, సాంకేతిక సిబ్బంది మొత్తం పది మందిలో ప్రస్తుతం అయిదుగురు మాత్రమే ఉన్నారు. వీరికి కనీస స్థాయిలో పనిలేదు. మహిళలకు కుట్టు, చేతి వృత్తులు, పట్టు అలంకారాలు, గృహోపకరణాల తయారీపై శిక్షణ ఇస్తే కేంద్రం సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకొంటే కొంతైనా ప్రయోజనం ఉంటుందని, లేదంటే కాలగర్భంలో కలిసే అవకాశాలు లేకపోలేదని పలువురు చెబుతున్నారు.

స్పందన కరవు..

ప్రారంభంలో శిక్షణ పొందేందుకు ఎక్కువ మంది చేనేత కార్మికులు ఆసక్తి చూపేవారు. ఐదేళ్లు నుంచి ముందుకు రావటం లేదు. శిక్షణ కాలంలో రోజుకు రూ.40 చొప్పున భృతి, చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు రావటంతో కనీస స్థాయిలో శిక్షణ పొందేందుకు ముందుకు రావడంలేదు. శిక్షణ భృతి రెండు నెలలకు రూ.6 వేలకు పెంచితే కార్మికులు వచ్చే అవకాశం ఉందని ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా.. దీనిపై ప్రభుతం స్పందన లేదు. ప్రభుత్వం నిధులు కేటాయించక నిర్లక్ష్యానికి గురై కేంద్రం భవనాలు శిథిలావస్థకు చేరుకొన్నాయి.

భృతి పెంచాలని ప్రతిపాదనలు చేశాం

భృతి తక్కువగా ఉన్నందును శిక్షణ పొందేందుకు చేనేత కార్మికులు ముందుకు రావటంలేదు. ఈ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. సమగ్ర నైపుణ్యాభివృద్ధి పథకం తీసుకొస్తే మరికొంత మందికి ఈ కేంద్రం ఉపయోగపడే అవకాశం ఉన్నందున ఈ విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

మైసూరు నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌, శిక్షణ కేంద్రం, చేనేత- జౌళి శాఖ సహాయ సంచాలకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని