logo

బామ్మపై బాధ్యత భారం

కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రామక్కకు  కొడుకు రవి ఏకైక సంతానం. రవికి భార్య రాధ, ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.

Published : 05 Feb 2023 04:29 IST

మునిమనవళ్లతో రామక్క

గాయపరిచిందని గతాన్ని.. కలిసిరావట్లేదని కాలాన్ని నిందించలేదామె.

తనపనితాను చేసుకోలేని వయస్సులోనూ.. బంధాల బాధ్యతను మరచిపోలేదు.

ప్రస్తుత స్వార్థపూరిత సమాజంలో.. రక్త సంబంధాలను పట్టించుకోని కాలంలోనూ.. అమ్మానాన్నలేని ఇద్దరు మునిమనవళ్ల ఆలనాపాలనను భుజానికెత్తుకుంది.

తనకు మోయలేని భారమైనా.. శరీరం సహకరించకపోయినా.. వృద్ధాప్య బడలికనూ లెక్కచేయకుండా ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.

కదిరి పట్టణం: కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రామక్కకు  కొడుకు రవి ఏకైక సంతానం. రవికి భార్య రాధ, ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. కుమార్తె (రామక్క మనవరాలు) మహేశ్వరిని ఆరేళ్ల కిందట తలుపుల మండలం చిన్నపల్లికి చెందిన సోమశేఖర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఐదేళ్ల మోహిత్‌, మూడేళ్ల వరుణ్‌ సంతానం. సంతోషంగా సాగిపోతున్న మహేశ్వరి, సోమశేఖర్‌ దాంపత్యం అర్ధాంతరంగా ఆగిపోయింది. అనారోగ్యం బారినపడిన ఈ దంపతులిద్దరూ ఒకరివెంట ఒకరు మృత్యువాతపడ్డారు. సోమశేఖర్‌ నాలుగునెలల కిందట మరణించగా.. మహేశ్వరి రెండునెలల కిందట కన్నుమూసింది. ఊహ తెలియని చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఇద్దరు మనవళ్లను వారి తాత రవి కటారుపల్లికి తీసుకొచ్చారు. కానీ, రవి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు రవి పరిస్థితిని కళ్లారా చూస్తున్న రామక్క మునిమనవళ్ల పోషణ బాధ్యతను తీసుకుంది. ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరు చిన్నారులను పోషిస్తోంది. తన ప్రాణం ఉన్నంతవరకు వారికి ఏలోటూ రానివ్వనని, అయితే తానెంతకాలం బతుకుతానో తెలియదని, తన తర్వాత చిన్నారుల పరిస్థితేంటని కుమిలిపోతోంది. ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తన మునిమనవళ్లను ఆదుకోవాలని వేడుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని