logo

గడప దాటని ట్యాగులు..

గొర్రెలకు గుర్తింపు సంఖ్య ఇవ్వాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎనిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం (ఎన్‌ఏడీసీపీ) చేపట్టింది.

Updated : 06 Feb 2023 05:42 IST

రూ.7.54 కోట్ల విలువైనవి వృథా

గొర్రెల గుర్తింపులో నిర్లక్ష్యం


ట్యాగులు ఇవే..

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: గొర్రెలకు గుర్తింపు సంఖ్య ఇవ్వాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎనిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం (ఎన్‌ఏడీసీపీ) చేపట్టింది. పశువుల మాదిరిగానే ప్రతి గొర్రెకు ట్యాగులు వేయాలని నిర్ణయించింది. 2020లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 58 లక్షల ట్యాగులు కేంద్ర సర్కారు పంపింది. వాటి విలువ రూ.7.54 కోట్లు. అవన్నీ జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలోని గొర్రెల అభివృద్ధి సహకార సంఘానికి చెందిన గదిలో మూలుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గొర్రెల పెంపకంలో మహబూబ్‌నగర్‌ జిల్లా అగ్రస్థానంలో ఉండేది. తరువాత స్థానం అనంతపురం జిల్లాదే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 58 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. అందులో 49 లక్షలు గొర్రెలు, 9 లక్షల మేకలు. ఎన్‌ఏడీసీపీ కింద ప్రతి గొర్రె చెవుకు ట్యాగు వేయాలన్నదే ప్రధాన ఉద్దేశం.

సహకార సంఘం కార్యాలయంలో ఇలా..

ఎంతో ప్రయోజనం..

ట్యాగులు వేయడం ఎంతో ప్రయోజనకరం. ప్రతి గొర్రెకు గుర్తింపు సంఖ్య వస్తుంది. వాటి యజమానిని తెలుసుకోవచ్చు. అపహరణకు ఆస్కారం ఉండదు. ఏటా గొర్రెలకు పారుడువ్యాధి టీకాలు వేస్తారు. ఈ ప్రక్రియకు సులవుగా ఉంటుంది. ఏటా జిల్లా అంతటా రెండు, మూడు రకాలు టీకాలు వేస్తున్నారు. ఏ గొర్రెకు వేశారో.. వేయలేదోనన్నది తెలియకుండా పోతోంది. వేసిన తర్వాత ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. వేయకుంటే యాప్‌ తీసుకోదు. ట్యాగులు పశువైద్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు వేయకూడదు. గోపాలమిత్ర, జీవమిత్ర, పశుమిత్రలతో ట్యాగులు వేయించాలి. ఇందుకు కొంత సొమ్ము చెల్లిస్తారు. వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలకు సొమ్ము జమ చేస్తుంది. ఈప్రక్రియ రెండేళ్లకు పైగా ఆగిపోయింది.

సీమ జిల్లాలకు...

ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు కలిపి మొత్తం ట్యాగులన్నీ అనంతపురం జిల్లాలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ అవరణంలోని భవనంలో భద్రపరిచారు. పది రోజుల కిత్రమే ఆయా జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో ట్యాగుల పెట్టెలు తరలించడం గమనార్హం.

చర్యలు చేపట్టాం...

రెండేళ్ల క్రితమే 58 లక్షల ట్యాగులు వచ్చింది వాస్తవమే. గొర్రెలకు ట్యాగులు వేయలేదు. అన్ని పశువైద్యశాలలకు వారం క్రితమే సరఫరా చేశాం. రాయలసీమ జిల్లాలకూ పంపించాం. జిల్లాలోని ప్రతి గొర్రెకు ట్యాగు వేయడానికి చర్యలు తీసుకుంటాం.

శ్రీలక్ష్మీ, సీప్‌ ఏడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని