logo

అధికారం మనదే.. ఆక్రమిస్తే అడిగేదెవరు..?

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి, అనంతపురం నగరానికి మధ్యనున్న ధర్మవరంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

Published : 06 Feb 2023 03:44 IST

జగనన్న లేఅవుట్‌లో రిజర్వ్‌ స్థలాలు పరులపాలు

చదును చేసిన స్థలం

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి, అనంతపురం నగరానికి మధ్యనున్న ధర్మవరంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు శివారులో రూ.వేలల్లో భూములు ధర పలికేవి. ఇప్పుడు రూ.లక్షల్లో ఉంది. ఈ క్రమంలో అధికారం మనదేనని రిజర్వ్‌ స్థలాలను ఆక్రమిస్తూ.. శాశ్వత నిర్మాణ పనులు అధికార పార్టీ నాయకులే చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు రెవెన్యూ, గృహ, మున్సిపల్‌ అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి జగనన్న లేఅవుట్‌లో సర్వే నంబరు 36, 47, 48, 50, 51, 52, 53, 54, 57లో 133.69 ఎకరాలు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా ఒకటున్నర సెంటు ప్రకారం 3,983 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు.

ఇప్పుడు నిర్మిస్తే...

పట్టణ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని పోతులనాగేపల్లి జగనన్న లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. గుడి, బడి, ఆట స్థలాలు, నీటి ట్యాంకులు, ఉద్యానవనాల ఏర్పాటుకు 12.09 ఎకరాలు కేటాయించారు. పట్టణం రోజు రోజుకూ విస్తరిస్తుండటం.. అనంతపురం - పుట్టపర్తి రహదారిలో ఉండటంతో లేఅవుట్‌లో భూములకు విలువ పెరిగింది. రోడ్డు పక్కనున్న స్థలాలు సెంటు రూ.4 లక్షలకు పైగా ధర పలుకుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ నాయకులు కొందరు ఇప్పుడు ఆక్రమిస్తే.. భవిష్యత్తులో తమ వశం అవుతాయని పోటీపడి జగనన్న లేఅవుట్‌లో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం అటు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని మిన్నుకుండిపోతున్నారు. కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి.. రిజర్వ్‌ స్థలాలకు వేలం నిర్వహించి అద్దె వసూలు చేస్తే ఆక్రమణకు గురికాకుండా ఉండటంతోపాటు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు.

నిర్మాణం ఇలా..


మూడు చోట్ల సిమెంట్‌ ఇటుకలకు కేటాయించాం

జగనన్న కాలనీ వాసులకు సిమెంట్‌ ఇటుకలు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్‌ స్థలాల్లో మూడు చోట్ల ఇటుకలు వేసేందుకు అనుమతిచ్చాం. ఇంటి నిర్మాణ పనులు పూర్తి అవగానే వాటిని తొలగించాలి. మిగిలిన రిజర్వ్‌ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాల విషయం తన దృష్టికి రాలేదు.

మునీశ్వర నాయుడు, గృహనిర్మాణ డీఈ, ధర్మవరం


మా పరిధిలో లేదు..

పోతులనాగేపల్లి జగనన్న లేఅవుట్‌ మా పరిధిలో లేదు. రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల పర్యవేక్షణలో ఉంది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోలేం.

మల్లికార్జున, మున్సిపల్‌ కమిషనర్‌


ఎంతెంత భూమి కేటాయించారంటే..

విభాగం                              భూమి(ఎకరాల్లో)

జగనన్న లేఅవుట్‌ ఏరియా        133.69
రహదారులు                            45.02
రిజర్వ్‌ ఓపెన్‌ స్థలాలు                12.09
పార్కింగ్‌                                  6.46
వసతుల కల్పన                        5.12


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని