logo

ఉల్లాసం.. అంతలోనే విషాదం

ఉల్లాసంగా గడిపేందుకు రెండు ద్విచక్ర వాహనాల్లో వస్తున్న యువకుల వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.

Published : 06 Feb 2023 03:44 IST

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

పరిగి, న్యూస్‌టుడే: ఉల్లాసంగా గడిపేందుకు రెండు ద్విచక్ర వాహనాల్లో వస్తున్న యువకుల వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న పరిగికి చెందిన మంజునాథ్‌ (26) హొన్నంపల్లి నుంచి ద్విచక్ర వాహనంలో ఇంటికి వస్తుండగా. అదే గ్రామం సీతారాపురం కాలనీకి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఖలీద్‌ బాషా (24) అలియాస్‌ ఇడ్లీ, స్నేహితులు బాబాపకృద్ధీన్‌, నిషార్‌ అహమ్మద్‌ మరో ద్విచక్ర వాహనంలో పరిగి వైపు వస్తున్నారు. స్థానిక చెరువు కొనకట్ట తూము మలుపు వద్ద ఆదివారం సాయంత్రం ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన నలుగుర్ని 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంజునాథ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖలీద్‌బాషాకు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌ వాహనంలో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. బాబాపకృద్ధీన్‌, నిషార్‌అహమ్మద్‌ చికిత్స పొందుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మంజునాథ్‌ మృతిచెందడంతో ఆస్పత్రిలో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమకు ఇక దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఖలీద్‌ బాషా తండ్రి గతంలో.. తల్లి ఆరు నెలల కిందట విద్యుదాఘాతంతో మృతిచెందారు. అతనికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేంద్ర తెలిపారు.

అధ్వాన రహదారి బలిగొంది

మలుపు మద్ద అధ్వానంగా ఉన్న రహదారి కారణంగానే ఇద్దరి యువకుల ప్రాణాలు గాల్లో కలసి పోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. గుంతలు పడిన రహదారిని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు ఆర్‌అండ్‌బీ అధికారులను కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని