logo

జాతీయస్థాయి క్రీడలు ఉన్నట్టా.. లేనట్టా..!

జాతీయస్థాయి క్రీడాపోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పరీక్షలకు ముందే క్రీడా పోటీల నిర్వహణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

Updated : 06 Feb 2023 06:33 IST

బడ్జెట్‌ విడుదల చేయని ప్రభుత్వం

అసోసియేషన్ల ఆధిపత్య పోరుతో విద్యార్థులకు నష్టం

జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడుతున్న విద్యార్థులు (పాత చిత్రం)

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయస్థాయి క్రీడాపోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పరీక్షలకు ముందే క్రీడా పోటీల నిర్వహణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నేటికీ రాష్ట్రస్థాయి పోటీలే పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి క్రీడల పోటీలు ఉన్నట్టా లేనట్టా అన్న సందిగ్ధత నెలకొంది. క్రీడా బడ్జెట్‌ లేదు.. సామగ్రి లేదు, జాతీయస్థాయి క్రీడా పోటీల ప్రణాళిక షెడ్యూల్‌ విడుదల కాకపోయినా ఈ ఏడాది ఏపీ రాష్ట్ర క్రీడా పాఠశాలల సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) క్రీడా పోటీలను చేపట్టింది.

ఆర్థిక కష్టాలు

ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడా పోటీల నిర్వహణ వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆర్థిక కష్టాలను తెచ్చి పెట్టింది. క్రీడా పోటీలు తప్పనిసరని ప్రభుత్వం ఆదేశించడంతో సొంత నిధులు, దాతల ఆర్థిక సాయంతో మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో పోటీలు నిర్వహించారు. సరిపడా క్రీడా సామగ్రి లేకపోయినా... కొన్నిచోట్ల మైదానాలు బాగుంటే, మరికొన్నిచోట్ల అసలే లేకపోవడం, ఉన్నచోట ఆడుకోవడానికి అనువుగాలేక విద్యార్థులకు తప్పని అవస్థలు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లేందుకు రవాణా ఛార్జీలు, దుప్పట్లు, తదితర వస్తువులు క్రీడాకారులే వెంట తెచ్చుకోవాలని ఎస్‌జీఎఫ్‌ సూచించడంతో.. ఆర్థిక స్థోమతలేని విద్యార్థులు ఆడేందుకు ముందుకు రాని పరిస్థితి. రైల్వేశాఖ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు రూ.75 రాయితీతో అందించే రవాణా సదుపాయాన్ని రద్దు చేసింది. ఒక్కొక్కరికి సాధారణ టిక్కెట్‌పై వెళ్లాలన్నా రూ.600 కావాలి. క్రీడల నిర్వహణకు విస్తరాకుల నుంచి తాగునీటి వరకు రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కో ఈవెంట్‌కు 800 మంది దాకా క్రీడాకారులు వస్తారు. వీరికి అయ్యే ఖర్చు భారమే. దీంతో ఆడాలన్న ఆసక్తి ఉన్నా పేద విద్యార్థులు ఆర్థిక భారంతో వెనకడుగు వేసే దుస్థితి. దాతల సహకారంతో ఇంతవరకు నెట్టుకు రాగిలిగారు.

కొన్నింటికే పరిమితం

ఎస్‌జీఎఫ్‌ఐ పరిధిలో 86 రకాల ఆటలుంటే 46కే కుదించారు. జిల్లాలో 46 క్రీడలకుగాను 30 క్రీడా పోటీలను పూర్తి చేశారు. ఇంకా 16 క్రీడలను ఈనెల ఆఖరులోపు పూర్తి చేయాలని సీఎస్‌సీ ఆదేశించింది. స్కూల్‌గేమ్స్‌లో 16 రకాలైన బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, హ్యాండ్‌బాల్‌, రగ్బీ, స్విమ్మింగ్‌, బాక్సింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌ టెన్నిస్‌బాల్‌ వంటి ఆటలకు నేరుగా జిల్లాస్థాయి పోటీలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.


‘క్రీడా క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు నుంచి సెప్టెంబరులోపు జిల్లాస్థాయి ఆటల పోటీలు పూర్తి చేసి.. నవంబరు, డిసెంబరులో ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌, జనవరి, ఫిబ్రవరి లోపు జాతీయ స్థాయి క్రీడా పోటీలను పూర్తి చేయాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఫిబ్రవరి మొదలైనా ఇంకా ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీలే పూర్తి కాలేదు. మార్చి నుంచి పరీక్షల కాలం. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం సాధ్యపడదు. ఆరా తీస్తే ఈ పోటీలు లేనట్టేనని తెలుస్తోంది’


ఉమ్మడి అనంత జిల్లాలో ఉన్నత పాఠశాలలు: 661
విద్యార్థులు: 2.40 లక్షలు, ఆడాల్సిన మొత్తం క్రీడలు: 86
ఆడిస్తున్నది: 46, పూర్తయిన క్రీడలు: 46
ఇంకా నిర్వహించాల్సినవి: 16
జాతీయ స్థాయికి ఎంపికనవారు: 69 మంది


రెండు, మూడు కార్యవర్గాల ఏర్పాటుతో..

అసోసియేషన్ల ఏర్పాటుకు ఎలాంటి ఎన్నికలు లేనందున ఎవరికివారు రెండు, మూడు కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుని పాతుకుపోయారు. మరో కార్యవర్గం ఏర్పాటుతో వివాదానికి దారితీసింది. డబ్బులు ఉన్నవాళ్లు అసోసియేషన్ల ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో కార్యవర్గం ఐదు ఈవెంట్స్‌ని నిర్వహించాలి. క్రీడాకారులను పెంచాలి. ఒక్కో ఈవెంట్‌కి రూ.3 లక్షల వ్యయం చేయాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల జారీ ఎవరు చేయాలి, ఎవరికి చెల్లుబాటు చేసే అధికారం ఉందన్న దానిపై అసోసియేషన్లు కోర్టు మెట్లెక్కాయని, ఆ కారణంగా ఈఏడు జాతీయస్థాయి క్రీడా పోటీలు ఉండవని ఇప్పటికీ విడుదల కాని షెడ్యూలే అందుకు నిదర్శనం. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి. క్రీడా కోటాలో ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

ఎంపిక ప్రక్రియ జరుగుతోంది

జాతీయస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికి 46 క్రీడలకుగాను 30 పూర్తి చేశాం. ఇంకా 16 ఈనెల లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయస్థాయి క్రీడా పోటీలకు 69 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కోర్టులో కేసు నడుస్తోంది. జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఉండక పోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం నిర్వహిస్తామంటే అందుకు సిద్ధంగా ఉన్నాం.

అంజన్న, ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని