logo

నేర వార్తలు

మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన కిషన్‌చౌదరి (23) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. బంధువుల వివరాల మేరకు.. డి.చెర్లోపల్లికి చెందిన చల్లా రంగనాయుడు ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు.

Updated : 07 Feb 2023 06:18 IST

ఉద్యోగసాధనకు సన్నద్ధమవుతూ.. ఆకస్మిక మృతి

కిషన్‌ చౌదరి (పాత చిత్రం)

బత్తలపల్లి, న్యూస్‌టుడే : మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన కిషన్‌చౌదరి (23) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. బంధువుల వివరాల మేరకు.. డి.చెర్లోపల్లికి చెందిన చల్లా రంగనాయుడు ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు. ఆయన పెద్ద కుమారుడు కిషన్‌చౌదరి బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ సాధనలో భాగంగా శిక్షణ తీసుకోవడానికిగాను బెంగళూరు వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండె నొప్పితో బాధపడుతుండగా చూసిన పెంచుకున్న కుక్క అరవడంతో కుటుంబ సభ్యులు లేచి చూశారు. వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చి  అంత్యక్రియలు చేశారు. చిన్నవయసులో మృతి చెందడంతో  గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి    నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను     పరామర్శించారు.


గ్రామ వాలంటీరు బలవన్మరణం

నవీన్‌కుమార్‌ (పాత చిత్రం)

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపం చెంది గ్రామ వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలో చోటుచేసుకుంది. బ్రహ్మసముద్రానికి చెందిన నవీన్‌కుమార్‌ (34) స్థానిక సచివాలయం పరిధిలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇతడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్య తరచూ భర్తతో, అత్తమామలతో గొడవ పడుతుండేది. ఇరవై రోజుల క్రితం భార్య హర్షిత పుట్టింటికి వెళ్లింది. పలుమార్లు పిలిచినా పుట్టింటి నుంచి తిరిగి రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమీపంలోనే ఉంటున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి చూడగా నవీన్‌కుమార్‌ ఉరి వేసుకుని మృతిచెందినట్లు గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి గిరిమల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి పంచనామా కోసం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


తేనెటీగల దాడిలో అయిదుగురు విద్యార్థులకు గాయాలు

అబ్దుల్‌ రహిమాన్‌కు చికిత్స చేస్తూ...

గోరంట్ల, న్యూస్‌టుడే: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై సోమవారం సాయంత్రం తేనెటీగలు దాడిచేసి కుట్టాయి. ఈ ఘటనలో అబ్దుల్‌ రహిమాన్‌, షాహిద్‌, మరో విద్యార్థి, ఉపాధ్యాయుడు గోపాల్‌తోపాటు ఆటో చోదకుడు ఫక్రుద్దీన్‌ గాయపడ్డారు. ఫక్రుద్దీన్‌ తన ఆటోలో విద్యార్థి అబ్దుల్‌ రహిమాన్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యాధికారి వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో చికిత్స అందించి.. 108 వాహనంలో హిందూపురం పంపించారు. విద్యార్థి శరీరం నుంచి వందకుపైగా ముళ్లు తొలగించినట్లు డాక్టర్‌ చెప్పారు. అదే సమయంలో అక్కడే పదోతరగతి విద్యార్థులకు స్టడీఅవర్స్‌ జరుగుతున్నాయి. ఉపాధ్యాయుడు గోపాల్‌ అప్రమత్తమై విద్యార్థులందరిని తరగతి గతిలోకి తీసుకెళ్లి తలుపులు వేయడంతో వారు దాడి నుంచి బయటపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని