logo

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలపై దాడి చేశారు.

Published : 07 Feb 2023 04:42 IST

కళాశాల పైఅంతస్తు నుంచి దూకి అఘాయిత్యం కళాశాలలో అద్దాలు ధ్వంసం చేస్తున్న సంఘం నాయకుడు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలపై దాడి చేశారు. వన్‌టౌన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కదిరి పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని అనంతపురం నగరంలో మేనత్త ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం యథాప్రకారం కళాశాలకు వెళ్లినా.. తరగతులకు హాజరుకాలేదు. 11 గంటల ప్రాంతంలో కళాశాల పైఅంతస్తు నుంచి దూకింది. ఈ ప్రమాదంలో విద్యార్థినికి నడుము విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని ఆరా తీశారు. విద్యార్థిని బ్యాగులో రాసి పెట్టుకున్న ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల తల్లి బెంగళూరులో, తండ్రి ఆగ్రాలో ఉంటున్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు లేఖలో పేర్కొనట్లు సమాచారం. తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఒక్కోచోట ఉంటున్నారని, ఈ విషయమై తరచూ స్నేహితురాళ్లతో వాపోయేదని తెలిసింది. కాగా కళాశాలలో రికార్డులకు సంబంధించిన ఫీజు రూ.12 వేలు చెల్లించాల్సి ఉందని విద్యార్థిని ఆసుపత్రిలో తెలపడం గమనార్హం.

విద్యార్థి సంఘాల దాడి: విషయం తెలుసుకున్న ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహంతో కుర్చీలు, టేబుళ్లను విసిరికొట్టారు. నీళ్ల క్యాన్లతో ఆఫీసు ఛాంబర్‌ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషనుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని