logo

గాడి తప్పిన పాలన

ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో డీఎస్పీ, తహసీల్దారు, సెబ్‌ సీఐ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి నెలలు గడిచినా నేటికీ కొత్త వారిని ఆయా స్థానాల్లో నియమించలేదు.

Published : 07 Feb 2023 04:42 IST

కీలక స్థానాల్లో అధికారుల్లేరు..

ధర్మవరం తహసీల్దారు కార్యాలయం

ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో డీఎస్పీ, తహసీల్దారు, సెబ్‌ సీఐ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి నెలలు గడిచినా నేటికీ కొత్త వారిని ఆయా స్థానాల్లో నియమించలేదు. ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నా తను చెప్పిందే జరగాలనే ఆ ప్రజాప్రతినిధి తీరు కారణంగా అధికారులుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా నెలల తరబడి ఇన్‌ఛార్జి పాలనే కొనసాగుతుండటంతో మూడు శాఖల్లో పరిపాలన గాడి తప్పింది.

ప్రజలకు తప్పని తిప్పలు

ధర్మవరం తహసీల్దారు నీలకంఠారెడ్డి రెండు నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇన్‌ఛార్జిగా బత్తలపల్లి తహసీల్దారు యుగేశ్వరిదేవి కొనసాగుతున్నారు. రెండు చోట్ల విధులు నిర్వహించాల్సి ఉండడంతో పనిభారం పడుతోంది. రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్‌, తదితర ధ్రువీకరణ పత్రాలు సమయానికి తీసుకోలేకపోతున్నారు. రైతులు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి పనులు జరగకపోవడంతో వెనుదిరుగుతున్నారు.

పర్యవేక్షణ అంతంతే..

పోలీసు శాఖను పర్యవేక్షించాల్సిన డీఎస్పీ స్థాయి అధికారి పోస్టు 3 నెలలుగా ఖాళీగా ఉంది. డీఎస్పీగా ఉన్న రమాకాంత్‌ గత ఏడాది నవంబరులో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. పెనుకొండ డీఎస్పీ హుస్సేన్‌ పీరా ధర్మవరం ఇన్‌ఛార్జి ఉన్నారు. రెండు డివిజన్లను నెలల తరబడి పర్యవేక్షిస్తుండటంతో ఆయనకు పని భారంగా మారింది. ధర్మవరం సబ్‌డివిజన్‌లో 5 సర్కిళ్లు ఉన్నాయి. ధర్మవరం వన్‌టౌన్‌, ధర్మవరం టూటౌన్‌, బత్తలపల్లి, ముదిగుబ్బ, రామగిరి సర్కిళ్లు సబ్‌ డివిజన్‌లో ఉన్నాయి. పది పోలీసుస్టేషన్లు డీఎస్పీ పరిధిలో ఉన్నాయి. ముదిగుబ్బ సర్కిల్‌ పరిధిలో ముదిగుబ్బ, తాడిమర్రి, పట్నం ఠాణాలు ఉన్నాయి. బత్తలపల్లి సర్కిల్‌ పరిధిలో ధర్మవరం గ్రామీణ, బత్తలపల్లి స్టేషన్లు ఉన్నాయి. ధర్మవరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. సమస్యాత్మక, ఫ్యాక్షన్‌ గ్రామాలు.. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఉన్నాయి.

* ధర్మవరం సెబ్‌ సీఐ సైదులు 2 నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. పెనుకొండ సెబ్‌ సీఐ శ్రీధర్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ధర్మవరం సెబ్‌ స్టేషన్‌ పరిధిలో ధర్మవరం పట్టణంతోపాటు గ్రామీణ, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు ఉన్నాయి. రెగ్యులర్‌ సెబ్‌ సీఐ లేకపోవడంతో కర్ణాటక నుంచి అక్రమ మద్యం ధర్మవరం, ముదిగుబ్బ ప్రాంతాలకు రవాణా సాగుతోంది. ముదిగుబ్బ మండలంలో కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా విక్రయాలు జోరందుకున్నాయి. సెబ్‌ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నా అడ్డదారుల్లో కర్ణాటక నుంచి ధర్మవరం నియోజకవర్గానికి మద్యం వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని