logo

దస్త్రాల్లో లెక్కలు.. ఎండిపోయిన మొక్కలు!

రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపు కోసం అవెన్యూ ప్లాంటేషన్‌ కింద రూ.లక్షలు ఖర్చుచేసి మొక్కలు నాటారు. నిర్వహణ లోపం కారణంగా అవి ఎండిపోవటంతో ప్రజాధనం వృథాగా మారింది.

Published : 07 Feb 2023 05:02 IST

బిల్లులు రాక.. నిర్వహణ భారం..

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపు కోసం అవెన్యూ ప్లాంటేషన్‌ కింద రూ.లక్షలు ఖర్చుచేసి మొక్కలు నాటారు. నిర్వహణ లోపం కారణంగా అవి ఎండిపోవటంతో ప్రజాధనం వృథాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆదిలోనే మొక్కలన్నీ ఎండిపోయాయి. సకాలంలో బిల్లులు అందకపోవడంతో వాటి సంరక్షణ గాలికొదిలేశారు. దీంతో మొక్కలు ఎండిపోయి కనుమరుగయ్యాయి. అధికారుల దస్త్రాల్లో లెక్కలు మాత్రం ఉండగా, నాటి మొక్కలు క్షేత్రస్థాయిలో సక్రమంగా లేకపోవడం గమనార్హం. రెండు సంవత్సరాల నుంచి మొక్కల సంరక్షణకు సంబంధించిన బిల్లులు రావడం లేదని అధికారులే స్పష్టం చేస్తున్నారు.

కిలోమీటరుకు 400 మొక్కలు నాటారు. ఒక్కో గుంత తీసేందుకు రూ.50 నుంచి రూ.60 వంతున, మొక్క నాటినప్పటి నుంచి వాటి సంరక్షణకు ఒక్కో మొక్కకు రూ.16 వంతున ప్రభుత్వం సంరక్షకులకు అందజేయాల్సి ఉంది. 2021-22 ఏడాదికి సంబంధించి అవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించిన బిల్లులు రాలేదు. జిల్లా వ్యాప్తంగా 2.15.761 మొక్కలు నాటగా ఇప్పటివరకు సంరక్షణకు పది నెలల బిల్లుల కింద రూ.1,88,38,100 రావాల్సి ఉంది.

* 2020-21, 2021-22 సంవత్సరాల్లో కడియం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ నుంచి పలు రకాల మొక్కలు తీసుకొచ్చింది. ఒక్కో మొక్కకు రూ.98 ధర వెచ్చింది. వీటి సంరక్షణ కోసం ఒక్కో మొక్కకు రూ.16 వంతున చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లులు అందిన దాఖలాలు లేవు. దీంతో చాలాచోట్ల మొక్కలకు నీరందించలేక పోతున్నారు. రోడ్డు పక్క ఉన్న మొక్కలు ఎండిపోయాయి. ఇలాంటి వాటికి సంరక్షణ బిల్లులు ఏ విధంగా ఇస్తారోననే సందేహం వ్యక్తమవుతోంది.

కళ్యాణదుర్గం ప్రాంతంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఏవీ?

* కళ్యాణదుర్గం మండలంలోని ఓ గ్రామానికి చెందిన సంరక్షకుడిని అడుగగా ఏడాదిగా మొక్కలకు నీరు పోసినా ఇప్పటివరకు రూపాయి బిల్లులు రాలేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా వస్తాయని చెబుతుండటంతో ఇప్పటికీ మొక్కలకు నీటిని పోస్తున్నానని చెప్పారు. వేసవిలో వాటిని సంరక్షించటం మరింత కష్టమవుతుందని, బిల్లులు రాకపోటంతో జీవనం కష్టమైందని వాపోతున్నారు.


ప్రతిపాదనలు పంపాం
- వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ

అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటించాం. ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు తెప్పించి ఖర్చు చేశాం. వాటిని రోడ్డుకు ఇరువైపులా నాటించాం. వాటి సంరక్షకులకు ఏడాది కాలంగా రూ.1.88 కోట్లకు బిల్లులు రావాల్సి ఉంది. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరైన వెంటనే అందజేస్తాం. త్వరలోనే సమస్య పరిస్కారం అవుతుంది. మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని