logo

నేర వార్తలు

ఒంటరితనంతో తాగుడుకు బానిసైన ఓ వాలంటీరు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి (28) వార్డు వాలంటీరుగా పనిచేస్తున్నాడు.

Published : 08 Feb 2023 06:17 IST

వాలంటీరు బలవన్మరణం

గుత్తి, న్యూస్‌టుడే: ఒంటరితనంతో తాగుడుకు బానిసైన ఓ వాలంటీరు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి (28) వార్డు వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లిదండ్రులు లేరు. ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. ఒంటరితనాన్ని తాళలేక ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం అయినా అతడు భోజనానికి రాకపోవడంతో చిన్నాన్నకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


చెరువులో పడి చేనేత కార్మికుడు..

ధర్మవరం: పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన పుట్లూరు నారాయణ (38) అనే చేనేత కార్మికుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 5 నుంచి బయటకు వెళ్లిన నారాయణ మంగళవారం ధర్మవరం చెరువులో మృతదేహమై తేలారు. స్థానికులు గమనించి 1వ పట్టణ పోలీసులకు తెలపడంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. చేనేతమగ్గం నేస్తూ చీరల వ్యాపారం నిర్వహిస్తూ నారాయణ కుటుంబాన్ని పోషించుకునేవాడని స్థానికులు తెలిపారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతుండేవారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. నారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


రైల్లో నుంచి పడి యువకుడి మృతి

గుత్తి, న్యూస్‌టుడే: వేగంగా వెళుతున్న రైల్లో నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గుత్తి మండలం, కొజ్జేపల్లికి చెందిన హనుమంతు కుమారుడు రవితేజ (28) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్ల కోసం సోమవారం అనంతపురంలోని ఎస్కేయూకు వచ్చాడు. సర్టిఫికెట్లతో హైదరాబాద్‌కు రాత్రి రైల్లో వెళుతూ ప్రమాదవశాత్తూ గుత్తి శివారులో పడిపోయాడు. తీవ్ర గాయాలవటంతో ప్రాణాలు కోల్పోయాడు. రైల్లో సీట్లు లేక బోగీ వాకిలి వద్ద కూర్చున్న రవితేజ రైలు కుదుపులకు పట్టుతప్పి కిందపడిపోయి ఉండవచ్చునని రైల్వే పోలీసులు చెప్పారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అనుమానాస్పద స్థితిలో మహిళ..

లేపాక్షి: మండలంలోని వీబూదిపల్లికి చెందిన గంగాదేవి (38) నీటికుంట వద్దనున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో భర్త సత్యనారాయణ, కుటుంబ సభ్యులు చుట్టపక్కల గాలించారు. ఆమె ఆచూకీ తెలియలేదు. మంగళవారం ఉదయం ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షర్ఫుద్దీన్‌ తెలిపారు.  


పాత కేసులో ఎర్రచందనం దొంగల అరెస్టు

తాడిపత్రి, న్యూస్‌టుడే: పాత కేసుల్లో నిందితులుగా ఉన్న ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసినట్లు గ్రామీణ సీఐ చిన్నపెద్దయ్య చెప్పారు. 2018 సంవత్సరంలో తాడిపత్రి మండలం బుగ్గ సమీపంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తూ పోలీసుల కంటపడగానే పరారైన కేసులో నిందితులుగా ఉన్న తమిళనాడు చెందిన శరావన్‌ మరో ఎనిమిది మంది, బెంగుళూరు చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున కొండాపురం గ్రామం వద్ద ప్రధాన రహదారిలో పుట్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న పది మంది ఎర్రచందనం కూలీలేనని సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని