logo

ఒకరి ఉద్యోగం మరొకరు చేస్తూ ప్రమాదం!

అనంతపురంలోని విద్యుత్తుశాఖ సెక్షన్‌ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించటం లేదు. ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకుని పనులు చేయిస్తున్నారు.

Published : 08 Feb 2023 06:23 IST

విద్యుదాఘాతంతో ప్రైవేటు వ్యక్తికి గాయాలు

చికిత్స పొందుతున్న రమేష్‌నాయక్‌

అనంత(విద్యుత్తు), న్యూస్‌టుడే: అనంతపురంలోని విద్యుత్తుశాఖ సెక్షన్‌ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించటం లేదు. ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకుని పనులు చేయిస్తున్నారు. మంగళవారం డీ-5 సెక్షన్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి అందుబాటులో లేకపోవటంతో అతని పనిని ప్రైవేట్‌ వ్యక్తులు చేసేందుకు వెళ్లారు. పాపంపేటలోని ఒక ఇంటికి ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ ప్రమాదకరంగా ఉందని వినియోగదారుడొకరు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌వోసీలో ఫిర్యాదు నమోదు కావడంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రైవేట్‌ వ్యక్తి రమేష్‌నాయక్‌ తన స్నేహితుడు శివానాయక్‌ వెళ్లారు. రమేష్‌ స్తంభంపైకి ఎక్కి సరిచేస్తుండగా, శివ వేరొక చోట వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో రమేష్‌నాయక్‌ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. బాధితుడిని 108లో నగరంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అతని కాలికి గాయమైంది. ప్రాణానికి హాని లేదని, పక్కటెముక చిట్లిందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టౌన్‌-2 డీఈఈ కుళ్లాయప్ప, ఏఈ నాగరాజు ప్రైవేట్‌ వైద్యశాలకు వెళ్లి రమేష్‌ను పరామర్శించారు. వారిద్దరూ శాఖలో పనిచేయడం లేదని, ఇంటి యజమాని పిలిస్తే సర్వీసు వైరు సరి చేయటానికి వెళ్లారని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని