logo

జీతాల జాడేదీ..!

ప్రతి నెలా మాదిరే... ఈసారి వేతన జీవులు నిరీక్షిస్తున్నారు. జీతం ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ వారం రోజులుగా ఆత్రుతతో ఆరాటపడుతున్నారు.

Published : 08 Feb 2023 06:23 IST

వారం గడిచినా అతీగతీలేదు
మదనపడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రతి నెలా మాదిరే... ఈసారి వేతన జీవులు నిరీక్షిస్తున్నారు. జీతం ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ వారం రోజులుగా ఆత్రుతతో ఆరాటపడుతున్నారు. ఇప్పటి దాకా అతీగతీలేకపోవడంతో ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తప్పడం లేదు. జీతంపై ఆధారపడి బతుకీడుస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. రోజువారి ఖర్చులకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1.37 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. పోలీసు శాఖలో కొందరికి, పెన్షనర్లు, గ్రామవార్డు ఉద్యోగులకే వేతనం వచ్చినట్లు తెలుస్తోంది. 30 శాతం దాకా వేతనాలు జమ అయినట్లు ఓ ఖజానా అధికారి పేర్కొన్నారు. వారం గడిచినా ఇంకా 70 శాతం మందికి జీతం రావాల్సి ఉంది.

అప్పు పుట్టిందా.. లేదా..

ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టే అప్పుపైనే జీతాలు ఆధారపడ్డాయి. క్రమంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమవుతుందో ‘లెక్క’ బయటకు పొక్కడం లేదు. గతనెల ఆఖరులో రూ.1500 కోట్లకుపై రుణం లభించడంతో కొందరికి జీతం పడినట్లు చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జమ అయ్యాయి. ఆ తర్వాత రుణం దొరకలేదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రానికి పుట్టే అప్పును బట్టే జీతాల చెల్లింపు ఉంటుందని భావిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపు ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆరు మాసాలకుపైగా ప్రతి నెలా ఇరవై తేదీ దాకా జీతాలు విడతల వారీగా జమ అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 18 ఖజానా కార్యాలయాలకు డీడీఓల నుంచి బిల్లుల అప్‌లోడ్‌ నిర్దేశిత గడువులో పూర్తి చేశారు. ఇక్కడి నుంచి రాష్ట్ర సీఎఫ్‌ఎంఎస్‌కు బిల్లుల ప్రక్రియ చేరింది. అక్కడి నుంచి బిల్లుల వారీగా ఆర్‌బీఐకి చెందిన ఈ-కుబేర్‌కు పంపారు.

ఆందోళన బాటలో..

సకాలంలో జీతాలు రాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఒకటో తేదీనే జీతం వచ్చేలా చట్టం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఒకటి రెండు రోజుల్లో వేతనాలు పడకపోతే నిరసన బాట పట్టాలన్న కోణంలో సంఘాలు కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. గతంలో పెన్షనర్ల సంఘం అనంత కలెక్టరేట్‌ ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనకు దిగింది. ఈదఫా కొందరు పింఛనర్లకు వేతనం అందింది. ఉపాధ్యాయ సంఘాలల్లో చాలా వరకు ఉమ్మడి ఆందోళనకు దిగాలని ఆలోచన చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని