logo

సొమ్ము ఒకరిది.. సోకొకరిది..!

ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం వారపు సంత జరుగుతుంది. దీంతో పాటు స్థానికంగా కూరగాయల విక్రయాలు నిత్యం వ్యాపారులు కొనసాగిస్తున్నారు.

Published : 08 Feb 2023 06:26 IST

ధర్మవరం కూరగాయల మార్కెట్‌కు ఎమ్మెల్యే తండ్రి పేరు

నూతనంగా నిర్మించిన సంత మార్కెట్‌ సముదాయం

న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణం: ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం వారపు సంత జరుగుతుంది. దీంతో పాటు స్థానికంగా కూరగాయల విక్రయాలు నిత్యం వ్యాపారులు కొనసాగిస్తున్నారు. పాత మార్కెట్‌ దుర్వాసనతో కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ నేపథ్యంలో నూతన సంత మార్కెట్‌ సముదాయానికి 2021న గుడ్‌విల్‌ విధానంలో శ్రీకారం చుట్టారు. 2021 నవంబరు 15న భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు. 14 నెలల వ్యవధిలో భవనం నిర్మాణ పనులు పూర్తి చేశారు. గతంలో సంత మార్కెట్‌ నుంచి రూ.28 వేలు అద్దె వసూలు చేసే పరిస్థితి ఉండేది. రూ.18 కోట్లు విలువచేసే భూమి నుంచి ఇంత తక్కువ అద్దె వస్తుండటం, మార్కెట్‌ కూడా అధ్వానంగా ఉండేది. ప్రస్తుతం అద్దె రూపేణ నెలకు రూ.7 లక్షలు ఆదాయం వస్తుందని మున్సిపల్‌ అధికారులు లెక్కలు కడుతున్నారు.
నూతనంగా నిర్మాణం చేసిన సంత మార్కెట్‌ సముదాయానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదు. కేవలం వ్యాపారుల ద్వారా గుడ్‌విల్‌ పద్ధతిలో నాలుగు వాయిదాల్లో సొమ్ము వసూలు చేసి భవన సముదాయాన్ని నిర్మించారు. కానీ, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి పేరైన ‘సూర్యప్రతాప్‌రెడ్డి కూరగాయల మార్కెట్‌’ అని నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక వ్యాపారులు సొమ్ము ఒకరిది.. సోకొకరిదా! అంటూ చర్చించుకుంటున్నారు. భవన సముదాయ చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణానికి పురపాలక నిధుల నుంచి రూ.40 లక్షలు వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు.

కేతిరెడ్డి సూర్య ప్రతాప్‌రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ బోర్డు


తప్పని తిప్పలు

నిత్యం శ్రమించి కూరగాయలు పండించే రైతులు మార్కెట్‌లో విక్రయించేందుకు వస్తే వారికి గదులు కేటాయింపు చేయడం లేదు. రాత్రి పూట రైతులు కూరగాయలను రోడ్డు పక్కన ఉంచుకోవాల్సి వస్తోంది. పందుల బెడదతో కంటి మీద కునుకు ఉండదు. ఆరుబయట దోమలకు ఇబ్బందులు పడాల్సిందే. కనీసం రైతులకు రెండు గదులు కేటాయిస్తే అందులో తెచ్చిన సరకులు ఉంచుకుని కాస్త కునుకు తీయడానికి అవకాశం ఉంటుంది. పాలకులు, అధికారులు అన్నదాత గురించి ఆలోచించకుండా.. ఆదాయమే మార్గంగా ఆలోచించారు. ఇప్పటికైనా చొరవ చూపి తమకు గదులు కేటాయించాలని చుట్టుపక్కల గ్రామ రైతులు కోరుతున్నారు.


రైతులకు సౌకర్యాలు కల్పిస్తాం..
- మల్లికార్జున, మున్సిపల్‌ కమిషనర్‌, ధర్మవరం

వ్యాపారులు, వినియోగదారులకు సౌకర్యవంతంగా మార్కెట్‌ నిర్మాణం చేయడం జరిగింది. 102 గదులను మాత్రమే గుడ్‌విల్‌ విధానంలో వేలం పాట నిర్వహించాం. మిగిలిన 51 షెడ్లకు ఎలాంటి గుడ్‌విల్‌ లేకుండా చిరు వ్యాపారులకు కేటాయించాం. రైతులకు గదుల కేటాయించేందుకు పరిశీలిస్తాం. అన్నదాతలకు సైతం సౌకర్యాలు కల్పిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని