logo

16 ఏళ్లు.. ప్రారంభమవని యూనిట్లు

రాయదుర్గం టెక్స్‌టైల్‌ పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించినా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు ప్రారంభించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదు.

Published : 08 Feb 2023 06:30 IST

రాయదుర్గం టెక్స్‌టైల్‌ పార్కు తీరిది

మూతపడిన కుట్టుశిక్షణ కేంద్రం

రాయదుర్గం: రాయదుర్గం టెక్స్‌టైల్‌ పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించినా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు ప్రారంభించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదు. పట్టణ శివారున 74.ఉడేగోళం వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్లకు పైగా వెచ్చించి టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేశారు. 2006లో పారిశ్రామికవేత్తలకు 55 ప్లాట్లు కేటాయించినా కేవలం ఏడుగురు మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలిన 48 మంది ప్లాట్లు వదులుకోకపోగా యూనిట్ల ఏర్పాటుకు కూడా ముందుకు రావటం లేదు. ఐదేళ్లుగా ప్రారంభించకపోతే రద్దు చేస్తామని చేనేత, జౌళిశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా సాకులు చూపుతూ పారిశ్రామికవేత్తలు ముందుకు రావటంలేదు. ఆ స్థలం నిరుపయోగంగా మారింది. ప్రారంభమైన ఏడు యూనిట్లలో మూడు మూతపడ్డాయి. మరో రెండు పూర్తిస్థాయిలో, మిగిలిన రెండు నత్తనడకన సాగుతున్నాయి. వాటిలో కొందరు యూనిట్ల విక్రయాలకు కూడా సిద్ధమవుతున్నారు. అన్ని యూనిట్లు నడుస్తున్నప్పుడు సుమారు 600 మందికి ఉపాధికి దొరికేది, ఇప్పుడు 300 మందికే పనులు లభిస్తున్నాయి. చాలామంది బళ్ళారి, బెంగళూరు, ముంబయిలాంటి నగరాలకు వలస వెళ్లారు.

* ఆరంభంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నప్పుడు దేవాదాయశాఖ పరిధి నుంచి చేనేత, జౌళిశాఖకు భూముల బదిలీ జరగలేదు. సేల్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌లు లేక వ్యాపారవేత్తలు ముందుకురాలేదు.

* గతంలో టెక్స్‌టైల్‌ పార్కులోని కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌(సీఎఫ్‌సీ)లో మహిళలకు 45 రోజుల పాటు ఏడాదికి మూడు, నాలుగుమార్లు శిక్షణ ఇచ్చేవారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం శిక్షణ నిలిపేయడంతో నాలుగేళ్లుగా దుస్తులు కుట్టేందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులు లభ్యం కావడంలేదు. సీఎఫ్‌సీలోని కుట్టుయంత్రాలు నిరుపయోగమయ్యాయి.

* టెక్స్‌టైల్‌ పార్కులో చేనేత, జౌళికి సంబంధించిన యూనిట్లే ఏర్పాటు చేయాల్సి ఉండటంతో  ప్రారంభానికి వ్యాపారులు ముందుకు రావటం లేదు. కాలుష్యం పేరుతో మరమగ్గాల ఏర్పాటుకు అధికారులు అంగీకరించటం లేదు.

ఖాళీగా స్థలం


వారంలోపు కుట్టుశిక్షణ ప్రారంభం..
- అప్పాజి, ఏడీ, జిల్లా చేనేత, జౌళిశాఖ, అనంతపురం

టెక్స్‌టైల్‌ పార్కులో వారంలోపు కుట్టుశిక్షణ ప్రారంభిస్తాం. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ అనుమతి తీసుకుని 48 యూనిట్ల ప్రారంభానికి నోటీసులు జారీ చేస్తాం. ఆసక్తి ఉన్నవారికి ప్లాట్లు కేటాయిస్తాం. పార్కు నిర్వహణకు చర్యలు తీసుకుంటాం.


ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి..
- చమ్మా ఇబ్రహీం, టెక్స్‌టైల్‌ పార్కు వ్యాపారుల సంఘం కార్యదర్శి

టెక్స్‌టైల్‌ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు, ప్రస్తుతం కరోనాతో దెబ్బతిన్న యూనిట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద రాయితీలు ఇవ్వాలి. కరోనా సమయంలో అదనపు రుణం, ఏడాదిపాటు వడ్డీల వాయిదాలు మాత్రమే ఇచ్చింది. రుణాలు మాఫీ చేయలేదు. ఇకనైనా మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని