logo

ఉత్తర్వుల పేరుతో వేధింపులు తగవు

సజావుగా విధులను నిర్వహిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న రైల్వే డ్రైవర్లు, సహాయ డ్రైవర్లను అధికారులు రకరకాల ఉత్తర్వుల పేరుతో వేధించడం...

Published : 21 Mar 2023 03:35 IST

కుటుంబాలతో సహా రైల్వే డ్రైవర్లు, సహాయకుల ధర్నా

నిరసన తెలుపుతూ..

గుంతకల్లు, న్యూస్‌టుడే: సజావుగా విధులను నిర్వహిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న రైల్వే డ్రైవర్లు, సహాయ డ్రైవర్లను అధికారులు రకరకాల ఉత్తర్వుల పేరుతో వేధించడం అన్యాయమని రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ కార్యదర్శి విజయకుమార్‌, అదనపు కార్యదర్శులు మహమ్మద్‌ గౌస్‌, మస్తాన్‌వలి అన్నారు. అధికారులు తమ డిమాండ్లను తీర్చాలని కోరుతూ లోకో రన్నింగ్‌ సిబ్బంది మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం వారి కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే జంక్షన్‌లోని క్రూ కంట్రోల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. పనిచేసే సిబ్బంది కంటే అధికారుల పోస్టులు అధికంగా ఉండడంతో రకరకాల ఉత్తర్వులు, ఆదేశాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సిబ్బంది ఆయా రైలు మార్గాల్లో విధులు నిర్వహించిన తరువాత వారు ఎక్కడెక్కడ సిగ్నళ్లు, పాయింట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన చిత్రాలను వేసి అధికారులకు అందజేయాలన్న నిబంధన సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇప్పటికే అధిక గంటలు పనిచేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతుంటే కొత్త ఉత్తర్వులు వారిని మరింత కుంగదీస్తున్నాయన్నారు. అధికారులు వేధింపులను విడనాడాలన్నారు. కౌన్సెలింగ్‌ పేరుతో సిబ్బందిని అధికారులు వారి చుట్టూ తిప్పుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అవసరమైన సెలవులు ఇవ్వకుండా, అలవెన్సుల్లో కోతలు విధించడం దారుణమని ధ్వజమెత్తారు. రన్నింగ్‌రూముల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌కు చెందిన లోకో రన్నింగ్‌ సిబ్బంది సంఘం కార్యదర్శి బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని